సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం రుద్రారంలో ఓ కుటుంబానికి పెను ప్రమాదం తప్పింది. డ్రైవర్‌కు మూర్ఛ రావడంతో ఓ ఆటో జాతీయ రహదారి పక్కనే ఉన్న కాలువలోకి దూసుకెళ్లింది. ఘటన సమయంలో ఆటోలో డ్రైవర్ సహా నలుగురు ఉన్నారు. వివరాల్లోకి వెళ్తే.. యాకూబ్ అనే డ్రైవర్ తన కుటుంబంతో కలిసి హైదరాబాద్ నుంచి సంగారెడ్డి జిల్లా మునుపల్లి మండలం కంకోల్కు ఆటోలో బయలుదేరాడు. సరదాగా.. కుటుంబసభ్యులతో కబుర్లు చెప్పుకుంటూ ప్రయాణం సాగిస్తున్నారు.
డ్రైవర్‌కు మూర్ఛ.. పంట కాల్వలోకి దూసుకెళ్లిన ఆటో!
ఆ కుటుంబం తమ సొంత ఆటోలో ఊరికి బయలుదేరింది. కబుర్లు చెప్పుకుంటూ ప్రయాణం సాగిస్తున్నారు. సాఫీగా సాగిపోతోన్న వారి జర్నీకి అనుకోని ఉపద్రవం ఎదురైంది. క్షణాల్లో ఆటో రోడ్డూ దిగి.. నీటి కాల్వలోకి దూసుకెళ్లింది! ఈ ఘటన తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది.
పటాన్చెరు మండలం రుద్రారం వద్దకు రాగానే ఒక్కసారిగా ఆటో అదుపు తప్పింది. ఏంటా అని చూస్తే.. డ్రైవింగ్ చేస్తున్న యూకూబ్‌కు మూర్ఛ వచ్చింది. అటు.. యాకూబ్‌ను చూసుకోవాలో.. ఇటు ఆటోను అదుపు చేయాలో.. తెలియలేదు. చూస్తుండగానే.. ఆటో రోడ్డు మీది నుంచి.. ఆ పక్కనే ఉన్న కాలువలోకి దూసుకెళ్లింది. ఈ అనుకోని ఘటనతో ఆటోలో ఉన్నవాళ్లు ఆర్తనాదాలు చేశారు.
బాధితుల అరుపులు విన్న స్థానికులు వెంటనే స్పందించారు. కాలువలోకి దిగి వారందరినీ సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి హానీ జరగలేదు. పెను ప్రమాదం నుంచి బయటపడటంతో వాళ్లంతా ఊపిరి పీల్చుకున్నారు. తమను రక్షించిన స్థానికులకు బాధితులు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం స్థానికులు శ్రమించి.. ఆటోను కూడా బయటకు లాగారు. విషయం తెలుసుకున్న యాకూబ్ బంధువులు వచ్చి వారిని వెంటబెట్టుకుని జాగ్రత్తగా తీసుకెళ్లారు.