Buying TRS MLAs Issue Case Update: తెరాస శాసన సభ్యులను ప్రలోభాలకు గురిచేశారనే కేసులో నిందితులను పోలీసులు జైలుకు తరలించారు. ఈ వ్యవహారంపై ఈ నెల 26న మొయినాబాద్ పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేయగా... 41-ఏ సీఆర్పీసీ నోటీసు ఇవ్వకుండా అరెస్ట్ చేయడం తగదంటూ రిమాండ్‌ను ఏసీబీ కోర్టు తిరస్కరించింది. ఆ ఉత్తర్వులను సవాల్ చేస్తూ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది. ఏసీబీ కోర్టు ఉత్తర్వులను రద్దు చేస్తూ నిందితులు పోలీసుల ఎదుట లొంగిపోవాలని, లేదా వారిని అరెస్టుచేసి రిమాండ్‌కు పంపాలని న్యాయమూర్తి ఆదేశాలు జారీచేశారు.
మరోవైపు ఇదే కేసులో రాష్ట్ర పోలీసుల దర్యాప్తుపై నమ్మకం లేదని ప్రత్యేక దర్యాప్తు బృందం లేదా సీబీఐకి అప్పగించాలని భాజపా దాఖలు చేసిన పిటిషన్‌పై మరో న్యాయమూర్తి విచారణ జరిపారు. దర్యాప్తును వాయిదా వేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీచేశారు. హైకోర్టు ఆదేశాలతో నిందితులైన రామచంద్ర భారతి, సింహయాజి, నందకుమార్‌ను పోలీసులు నిన్న రెండోసారి అరెస్ట్ చేశారు. అనంతరం ఏసీబీ కోర్టులో హాజరుపరచగా... నిందితులకు 14 రోజుల రిమాండ్ విధించింది. 41-ఏ సీఆర్పీసీ కింద నోటీసులు ఇవ్వకుండా అరెస్ట్ చేయడం తగదంటూ ఏసీబీ కోర్టు రిమాండ్‌ను తిరస్కరించిన నేపథ్యంలో హైకోర్టును ఆశ్రయించి పోలీసులు అనుమతి పొందారు. ఈ క్రమంలో నిందితులు ఫిల్మ్ నగర్ షేక్‌పేట రహదారిలో ఉన్న నందకుమార్ నివాసమైన ఆదిత్య హిల్ టాప్‌లో ఉన్నట్లు పోలీసులు సమాచారం సేకరించారు.
అక్కడకు వెళ్లిన బంజారాహిల్స్ పోలీసులు, సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు వెళ్లగా... గమనించిన నందకుమార్ లిఫ్టును నిలిపివేశాడు. దీంతో సెల్లార్‌కు చేరుకున్న పోలీసులు.. ఎనిమిదో అంతస్తుకు మెట్లపై నుంచి నడుచుకుంటూ వెళ్లారు. ఫ్లాట్ నంబరు 603లో నందకుమార్‌తో పాటు సింహయాజి, రామచంద్ర భారతిని అదుపులోకి తీసుకొన్నారు. అక్కడి నుంచి సైబరాబాద్ కమిషనరేట్ కార్యాలయంలో 15 నిమిషాలు విచారించారు. అనంతరం మోయినాబాద్ ఠాణాకు తరలించారు. అక్కడి నుంచి వైద్య పరీక్షల కోసం చేవెళ్ల ప్రభుత్వ అస్పత్రికి తరలించారు. తిరిగి ఠాణాకు వచ్చి అక్కడి నుంచి ఏసీబీ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి నివాసంలో హాజరుపరిచారు.