‘నాన్నా.. పేదవాళ్లు చదువుకోకూడదా? డబ్బున్నవాళ్లే చదువుకుని ఉన్నత స్థానాలకు వెళ్లాలా?’ అంటూ చిత్తూరు జిల్లా పలమనేరుకు చెందిన బాలిక మిస్బా ప్రశ్నిస్తూ.. ఆత్మహత్య చేసుకున్న ఉదంతం సంచలనంగా మారింది. బాలిక సూటిగా అడిగిన ప్రశ్నకు తండ్రి వజీర్ అహ్మద్.. ‘లేదమ్మా.. పేదవాళ్లైనా మంచి చదువులు చదవొచ్చు. పేదరికాన్ని అనుభవించి ఎన్నో కష్టాలు ఎదుర్కొన్న అబ్దుల్ కలాం రాష్ట్రపతి కాలేదా?’ అంటూ ధైర్యం నూరి పోసినప్పటికీ ఆమె వేదన తగ్గలేదు. ‘మరెందుకు నాన్నా.. నాకు మంచి మార్కులొస్తే స్నేహితురాలే ఓర్వలేకపోతోంది. రమేశ్ సార్ ఎందుకిలా వేధిస్తున్నారు? నేను మళ్లీ పాఠశాలకు వెళ్లాలంటే నా స్నేహితురాలి తండ్రి సునీల్ అనుమతి ఎందుకు తీసుకోవాలి?’ అంటూ తిరిగి కుమార్తె ప్రశ్నించడంతో తండ్రికి సమాధానం లేకపోయింది. వెంటాడిన మనోవేదనే ప్రతిభావంతురాలైన బాలికను మింగేసింది. బాలిక మరణంతో బాధితుల బంధువులు, తెదేపా నాయకులు, మైనారిటీ నేతలు గురువారం భగ్గుమన్నారు. బాలిక తల్లిదండ్రులు, బంధువులు తెలిపిన వివరాలివి. పలమనేరులో సోడాలు అమ్ముకుంటూ జీవించే వజీర్ అహ్మద్, నసీమా దంపతులకు కుమార్తె మిస్బా (16), 13ఏళ్ల కుమారుడు ఉన్నారు. మిస్బాను బ్రహ్మర్షి పాఠశాలలో ఎనిమిదో తరగతిలో చేర్పించారు. ఆమెకు ఎండీ కొత్తూరు వాసి, పలమనేరులో టమాటా మండీ నిర్వహించుకునే వైకాపా కార్యకర్త సునీల్ కుమార్తెతో స్నేహమేర్పడింది. సునీల్, పాఠశాల నిర్వాహకుడు రమేశ్ మధ్య ఆర్థిక లావాదేవీలు, బంధుత్వం ఉన్నాయి. మిస్బా చదువులో ముందుండగా, సునీల్ కుమార్తె కాస్త వెనుకబడింది. ప్రస్తుతం వీరిద్దరూ పదో తరగతి చదువుతున్నారు. ఇటీవల నిర్వహించిన పరీక్షలో మిస్బాకు మంచి మార్కులొచ్చాయి. విషయాన్ని సునీల్‌కు ఆయన కుమార్తె చెప్పింది. దీంతో మిస్బాను పాఠశాలనుంచి పంపించాలని రమేశ్‌పై సునీల్ ఒత్తిడి పెంచారు.
కుటుంబమంతా ఉరేసుకునేలా చేస్తా..:మిస్బాను రమేశ్ సూటిపోటి మాటలనేవారని ఆమె తల్లిదండ్రులు వివరిస్తున్నారు. ‘సోడాలు అమ్ముకునే మీరెక్కడ? పలుకుబడి ఉన్న సునీల్ కుమార్తె ఎక్కడ?’ అని బిడ్డతో అనేవారని వాపోతున్నారు. ‘నేను తలుచుకుంటే నీ కుటుంబాన్ని నాశనం చేస్తా. వారంతా ఉరేసుకునేలా చేస్తా’ అని బెదిరించాడని చెబుతున్నారు. దీంతో బాలిక మానసిక వేదనకు లోనైంది. ఇది ఇలా కొనసాగుతుండగానే కొన్నిరోజుల క్రితం మిస్బా జారిపడగా మడమ వద్ద ఎముక విరిగింది. అయినప్పటికీ రమేశ్ ఆమెను గుంజీలు తీయించారని కుటుంబీకులు వివరిస్తున్నారు. బాలిక తల్లి నసీమా పాఠశాలకు వెళ్లి ప్రశ్నించగా.. నీ కుమార్తెను వేరే పాఠశాలలో చేర్పించమంటూ రమేష్ గద్దించాడు. లేదంటే బడిలోకి అనుమతించేందుకు సునీల్‌తో చెప్పించాలన్నాడని తల్లిదండ్రులు వివరిస్తున్నారు. వేరే బడిలోనైనా ప్రవేశమిప్పించాలని తండ్రి వేడుకోవడంతో మరో పాఠశాల నిర్వాహకుడికి చెప్పారు. అక్కడికి వెళ్లిన మరుసటి రోజే బాలిక ఇంట్లో గదిలోకి వెళ్లి ఆత్మహత్య చేసుకుంది. ముందుగా ఆమె రాసిన లేఖ బుధవారం వెలుగుచూసింది.