హైదరాబాద్‌లో మరోసారి భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. కూకట్పల్లి న్యూ బాలాజీ నగర్‌లోని ఓ అపార్ట్మెంట్లో మాదక ద్రవ్యాలు విక్రయిస్తున్నారనే సమాచారం మేరకు.. మేడ్చల్ పోలీసులు దాడులు నిర్వహించారు. పవన్ అనే వ్యక్తి నుంచి 5 గ్రాములు మెఫిడ్రోన్ స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అరెస్ట్ చేసి విచారించారు. అతడు ఇచ్చిన సమాచారం మేరకు బొంగులూరు గేట్ సమీపంలోని గురుదత్త లాడ్జ్‌లో... మహేశ్ రెడ్డి వద్ద ఉన్న 921 గ్రాముల పట్టుకున్నారు. అనంతరం మహేశ్ నుంచి కూపి లాగిన పోలీసులు... నాగర్ కర్నూల్ జిల్లా తిమ్మాజీపేట మండలం బావాజిపల్లికి చెందిన రామకృష్ణ గౌడ్ ఇంట్లో తనిఖీలు నిర్వహించారు. రామకృష్ణ లేకపోవడంతో ప్రణాళిక ప్రకారం ఫోన్ చేసి మెఫిడ్రోన్ కావాలని అడిగారు. పలానా చోటుకు రావాలని చెప్పగా... మఫ్టీలో వెళ్లి అతడిని అదుపులోకి తీసుకున్నారు. కారులో ఉన్న 4.4 కిలోల సరకు స్వాధీనం చేసుకున్నారు.
కల్లులో కలిపే ఆల్ఫాజోలం సరఫరా..
డ్రగ్స్ ఎవరు సరఫరా చేస్తున్నారనే విషయంపై రామకృష్ణను పోలీసులు తమదైన శైలిలో విచారించారు. సురేష్, హన్మంత్ రెడ్డి మెఫిడ్రిన్ ఇచ్చినట్లు ఎక్సైజ్ అధికారులకు చెప్పాడు. ఇద్దరూ పరారీలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. సురేష్ నాలుగేళ్ల క్రితం ఆర్సీ పురంలో మత్తుపదార్థాలు తయారు చేస్తూ డీఆర్ఐ అధికారులకు పట్టుబడ్డాడని వెల్లడించారు. బావాజిపల్లికి చెందిన హన్మంత్ రెడ్డి కల్లులో కలిపే ఆల్ఫాజోలం సరఫరా చేస్తున్నాడని దర్యాప్తులో తేలింది. విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా అన్ని కళాశాలల వద్ద నిఘా ఏర్పాటుచేస్తామని మేడ్చల్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ విజయ భాస్కర్ తెలిపారు.