తెలుగు అకాడమీ నిధుల గోల్‌మాల్ కేసులో (TELUGU ACADEMY FD SCAM) కేసులో ప్రత్యేక బృందం ద్వారా దర్యాప్తు చేపట్టామని హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ తెలిపారు. ఈ కేసులో మొత్తం 10 మంది అరెస్టు చేశామని సీపీ వెల్లడించారు. సెప్టెంబర్ 27 యూనియన్ బ్యాంకు అధికారుల ఫిర్యాదుతో తొలి ఎఫ్ఐఆర్ నమోదైందని తెలిపారు. ఇప్పటివరకు ఈ స్కాంలో మూడు ఎఫ్ఆర్లు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. సుమారు రూ.64.50 కోట్ల ఎఫ్డీ నిధులను విత్‌డ్రా చేసినట్లు గుర్తించామన్నారు.
మొత్తం రూ.65.5 కోట్లు గోల్‌మాల్..
యూబీఐ కార్వాన్ శాఖ నుంచి రూ.26 కోట్లు, యూబీఐ సంతోష్‌నగర్ శాఖ నుంచి రూ.11 కోట్లు, చందానగర్ కెనరా బ్యాంక్‌లో రూ.6 కోట్లు ఎఫ్‌డీలు స్వాహా చేసినట్లు గుర్తించామని సీపీ తెలిపారు. గతేడాది డిసెంబరు నుంచి సెప్టెంబర్ 21 వరకు ఎఫ్‌డీల సొమ్ము కాజేశారని తెలిపారు. మొత్తం రూ.64.50 కోట్ల ఎఫ్‌డీల సొమ్ము గోల్‌మాల్ చేశారని పేర్కొన్నారు. ఈ స్కాంలో కీలక నిందితుడు సాయికుమార్‌పై గతంలో 3 కేసులున్నాయని తెలిపారు. ఈ కేసులో మరో 8మందిపై అనుమానాలు ఉన్నట్లు పేర్కొన్నారు. నిందితుల్లో ఎక్కువమంది ఏపీకి చెందినవారు ఉన్నారని సీపీ తెలిపారు.
ఆస్తులు కొనుగోలు చేశారు..
ఎఫ్‌డీల సొమ్ము అగ్రసేన్ కోపరేటివ్ సొసైటీ ఖాతాలోకి వెళ్లిందన్న సంయుక్త సీపీ అవినాష్ మహంతి.. ఏపీ మర్కంటైల్ బ్యాంక్‌కు 10శాతం కమిషన్ చేరినట్లు గుర్తించామన్నారు. అధికశాతం నిధులు సాయికుమార్ తీసుకున్నాడని.. మిగిలినవారు ఒప్పందం ప్రకారం వాటాలు పంచుకున్నారని వెల్లడించారు. పంచుకున్న డబ్బుతో నిందితులు ఆస్తులు కొన్నారని అవినాష్ మహంతి వెల్లడించారు.
ఆరు రోజుల కస్టడీ..
తెలుగు అకాడమీ అకౌంట్స్ అధికారి రమేష్ .. నిధుల గోల్‌మాల్ కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించినట్టు పోలీసుల దర్యాప్తులో బయటపడింది. నిధులు బ్యాంకుల నుంచి మళ్లిస్తున్నా.. అకౌంట్స్ అధికారిగా మీరు ఏం చేస్తున్నారు? మీకు బాధ్యత లేదా? అని పోలీసులు రమేశ్‌ను ప్రశ్నించినట్టు సమాచారం. యూబీఐ సంతోష్‌నగర్ బ్రాంచ్ చీఫ్ మేనేజర్ మస్తాన్‌వలీని మస్తాన్‌వలీని 6 రోజల కస్టడీకి సీసీఎస్ పోలీసులు తీసుకున్నారు. ఎఫ్‌డీల కుంభకోణంలో ప్రశ్నించనున్నారు.
ఇలా వెలుగులోకి వచ్చింది..
తెలుగు రాష్ట్రాల ఉమ్మడి జాబితాలో ఉన్న తెలుగు అకాడమీ (Telugu Academy Case).. హైదరాబాద్‌లోని హిమాయత్‌నగర్‌లో దశాబ్దాలుగా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఉమ్మడి జాబితాలో ఉన్న తెలుగు అకాడమీ నిధులను ఆంధ్రప్రదేశ్‌కు పంచాలంటూ కొద్దిరోజుల క్రితం సుప్రీంకోర్టు ఆదేశాలు జారీచేసింది. ఈనెల 28లోపు తెలుగు అకాడమీ సిబ్బంది, చరాస్తులను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు పంచుకోవాల్సి ఉంది. రాష్ట్ర విభజన నాటికి అకాడమీ వద్ద ఉన్న రూ.213 కోట్లను అధికారులు పలు బ్యాంకు శాఖల్లో డిపాజిట్ చేశారు. నిధులను ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు 58:42 నిష్పత్తిలో పంచుకోవాలి. ఆ ప్రకారం ఏపీకి రూ.124 కోట్లు ఇవ్వాల్సి ఉంది.
ఈ నేపథ్యంలో.. భవనాలు, నగదు వివరాలను లెక్కిస్తుండగా.. వివిధ బ్యాంక్‌లతో పాటు యూబీఐ కార్వాన్, సంతోష్‌నగర్ శాఖల్లో రూ.43 కోట్ల ఫిక్స్‌డ్ డిపాజిట్లున్నాయని(fixed deposits) తేలింది. గడువు తీరకముందే వాటిని తీసుకోవాలని అకాడమీ అధికారులు నిర్ణయించారు. ఈనెల 21న డిపాజిట్ పత్రాలు బ్యాంకుకు చేరినా అటువైపు నుంచి సమాచారం లేకపోవడంతో మూడు రోజుల తర్వాత తెలుగు అకాడమీ ఉద్యోగి రఫీక్ నేరుగా బ్యాంకుకు వెళ్లారు. ఆగస్టులోనే రూ.43 కోట్లు విత్‌డ్రా అయ్యాయని బ్యాంకు అధికారులు తెలిపారు. నిగ్గు తేల్చాలని అకాడమీ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఇదీచూడండి: