ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

నగర నడిబొడ్డున భీకర పోరు.. ఆ రెండు జోన్లలో గెలుపే కీలకం - vishaka political news

విశాఖపట్నం మేయర్‌ స్థానాన్ని నిర్ణయించడంలో జోన్‌-4, 5లోని వార్డులు కీలకం. జోన్‌-4లో 3 నియోజకవర్గాల్లో తెదేపా పైచేయి. జోన్‌-5లో 2 నియోజకవర్గాలు.. వైకాపా పైచేయి. ఈ రెండు జోన్లలో ఆధిపత్యానికి పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. ఓటర్లను ఆకర్షించే పనిలో ఉన్నాయి. కారణం.. జీవీఎంసీ పీఠాన్ని దక్కించుకోవడంలో ఈ జోన్లలోని వార్డులు అత్యంత కీలకం.

zone4,5 have key role in vishakapatnam municipal elections
zone4,5 have key role in vishakapatnam muncipal elections

By

Published : Feb 25, 2021, 12:31 PM IST

విశాఖపట్నం నగరంలోని 8 జోన్లలో 17,52,927మంది ఓటర్లున్నారు. కేవలం జోన్‌-4, 5ల్లోని 44 వార్డుల్లో ఏకంగా 44శాతం ఓటర్లు కేంద్రీకృతమై ఉన్నారు. ఈ రెండు జోన్లలోనే 7.62లక్షల ఓట్లున్నాయి.

5 నియోజకవర్గాల సమ్మేళనం

*జోన్‌-4లో విశాఖ ఉత్తరం, విశాఖ పశ్చిమ నియోజకవర్గాలు ప్రధానంగా ఉన్నాయి. విశాఖ దక్షిణ నియోజకవర్గంలోని కొంతభాగం కలుస్తోంది. ఉత్తరంలో 42వ వార్డు (కొంతభాగం) నుంచి 51, 53 నుంచి 55దాకా 12వార్డులున్నాయి. పశ్చిమలో 40, 52, 56 నుంచి 63దాకా 10వార్డులు ఈ జోన్‌లో వస్తున్నాయి. ఇక దక్షిణంలో.. 41వ వార్డు పూర్తిగా, 42వ వార్డు కొంతభాగం కలుస్తోంది.

*జోన్‌-5లో గాజువాక, పెందుర్తి నియోజకవర్గాలు వస్తున్నాయి. గాజువాకలో 64 నుంచి 76, 77, 78, 85 (కొంతభాగం), 86 (కొంతభాగం), 87దాకా.. 18 వార్డులు ఉన్నాయి. మరోవైపు పెందుర్తిలో 78 (కొంతభాగం), 79, 85 (కొంతభాగం), 86 (కొంతభాగం), 88దాకా 5 వార్డులు జోన్‌-5లో భాగంగా ఉన్నాయి.

మద్దతు ఇక్కడే...

జీవీఎంసీలో 98 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి. 98మంది కార్పొరేటర్లు ఎన్నిక కాబోతున్నారు. మరోవైపు 14మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు లాంటి ఎక్స్‌అఫీషియో సభ్యులు ఓటుహక్కును కలిగి ఉన్నారు. ఈ మొత్తం 112 మందిలో మేయర్‌ పీఠం దక్కించుకోవడానికి కనీసం 57మంది మద్దతు ఉండాలి. ఒక్క జోన్‌-4, జోన్‌-5లోనే 44మంది కార్పొరేటర్లు ఎన్నిక కాబోతున్నారు. మేయర్‌కు మద్దతు కావాలంటే ఇక్కడి వార్డుల్లో విజయం కీలకం.

  • జోన్‌-4లో ఉత్తరం, పశ్చిమ, దక్షిణ నియోజకవర్గాల్లో తెదేపా బలంగా ఉందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. దక్షిణ నియోజకవర్గంలో ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్‌ వైకాపాకు మద్దతిస్తున్నప్పటికీ.. తమ కేడర్‌ బలంగానే ఉందని తెదేపా పేర్కొంటోంది. ఈ జోన్‌లోని వార్డులు తమకు పట్టునిస్తాయని వారు విశ్వసిస్తున్నారు.
  • జోన్‌-5లోని గాజువాక, పెందుర్తి నియోజకవర్గాల్లో వైకాపా పార్టీకి చెందిన ఎమ్మెల్యేలున్నారు. దీంతో ఇక్కడున్న 20 వార్డుల్లోనూ తమ బలం నిరూపించుకోవచ్చనే ఆశతో ఆ పార్టీ ఉంది.
  • ఈ రెండు జోన్లు నగరంలో కీలక ఆర్థిక వనరులుగా ఉన్నాయి. పరిశ్రమలు, సంస్థలు, వాణిజ్య సముదాయాలు ఎక్కువ. పైగా జీవీఎంసీకి ఎక్కువగా ఆదాయం తెచ్చే వార్డులూ ఇక్కడే ఉన్నాయి. గెలిచే కార్పొరేటర్‌కు ఇక్కడ ప్రాధాన్యత ఎక్కువ.

పట్టుకోసం పార్టీల యత్నం

  • ఈ 44 వార్డుల్లో పేద, మధ్య తరగతి కుటుంబాలు, కార్మిక వర్గాలు ఎక్కువ. వారిని ఆకర్షించేందుకు పార్టీలు ప్రయత్నిస్తున్నాయి.
  • పశ్చిమ నియోజకవర్గంలో పట్టుకోసం ఇరు పార్టీలు శ్రమిస్తున్నాయి. దక్షిణంలో ఎమ్మెల్యే ఆధ్వర్యంలో అక్కడి సీట్లు దక్కించుకునేందుకు వైకాపా మంతనాలు సాగిస్తోంది.
  • సహజంగా ఈ రెండు జోన్లలో ఓటింగ్‌ శాతం తక్కువగా నమోదవుతూ వస్తోంది. ఈ శాతాన్ని పెంచితే లబ్ధి పొందొచ్చని పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. తెదేపా లోపాయికారిగా సంప్రదింపులు జరుపుతోంది. పట్టున్న వార్డుల్లో బలం పెంచుకోవడానికి ప్రయత్నాలు చేస్తోంది.
  • ఈ 44 వార్డులు కీలకం కాబట్టే, అభ్యర్థులెవరన్నది తేల్చడంలో పార్టీలు శ్రమిస్తున్నాయి. మార్చి 3న అభ్యర్థుల ఖరారు తర్వాత క్షేత్రస్థాయిలోకి పూర్తిగా వెళ్లాలనే ఆలోచనతో ఉన్నాయి. ఇప్పటికే ఆయా వార్డుల్లో తెదేపా, వైకాపా శ్రేణులు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి.

ఇదీ చదవండి: ఒకటి నుంచి ఏడో తరగతి దాకా సీబీఎస్‌ఈ: సీఎం జగన్

ABOUT THE AUTHOR

...view details