YSRCP MP MVV: విశాఖ నడిబొడ్డున ఉన్న అత్యంత ఖరీదైన 15 ఎకరాల దసపల్లా భూముల్ని.. వాటి యజమానులుగా చెప్పుకొంటున్న 64 మంది ఒకే మాట మీదికొచ్చి.. తమకు 29 శాతం వాటా చాలంటూ వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డికి అత్యంత సన్నిహితుల కంపెనీకి కట్టబెట్టేశారు. ఈ ఒప్పందమే తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం సృష్టిస్తే.. దాన్ని తలదన్నేలా, వినేవాళ్లు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యేలా అధికార పార్టీకే చెందిన స్థానిక ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ.. భూయజమానులతో చేసుకున్న ఒప్పందం బయటపడింది. భూయజమానులకు కేవలం 0.96 శాతం వాటా ఇచ్చి.. తాను 99.04 శాతం వాటా తీసుకునేలా వైకాపా ఎంపీ కుదుర్చుకున్న ఒప్పందం వెలుగుచూడటం దిగ్భ్రమకు గురిచేస్తోంది. ఇలాంటి అద్భుతాలు వైకాపా ప్రజాప్రతినిధులకు, వారి సన్నిహితులకే ఎలా సాధ్యమవుతున్నాయో తెలియక దేశమంతా విస్తుపోతోంది. విశాఖలో జరుగుతున్న భూదందాలకు, వైకాపా నేతల అరాచకాలకు.. ఈ ఒప్పందం పరాకాష్ఠగా నిలిచిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
విశాఖ వాసులకు బిల్డర్‌గా చిరపరిచితులైన ఎంవీవీ సత్యనారాయణ.. రాజకీయాల్లోకి ప్రవేశించి ఎంపీగా గెలవడంతో ఆయన పేరు చాలా మందికి తెలిసింది. స్థిరాస్తి వ్యాపారిగా, ఎంపీగా ఆయనకు ఇంతవరకూ రాని గుర్తింపు.. విశాఖ కూర్మన్నపాలెంలో చేపట్టిన ఓ నిర్మాణ ప్రాజెక్టుతో వచ్చింది. బహుశా ఆయనతో వ్యాపార పాఠాలు చెప్పించడానికి.. ప్రఖ్యాత బిజినెస్ స్కూళ్లు గెస్ట్ ఫ్యాకల్టీగా పిలిచినా ఆశ్యర్యపడాల్సిన పని లేదేమో. ఎంపీకి చెందిన ఎంవీవీ అండ్ ఎంకే సంస్థ.. కూర్మన్నపాలెంలో 10.57 ఎకరాల విస్తీర్ణంలో ఓ భారీ నిర్మాణ ప్రాజెక్టు చేపట్టింది.
5 వేర్వేరు సర్వే నెంబర్లలో ఉన్న ఈ భూములపై 11 మంది యజమానులతో.. 2018 జనవరి 8న జనరల్ పవరాఫ్ అటార్నీతో కూడిన డెవలప్‌మెంట్ ఎగ్రిమెంట్‌ను ఎంవీవీ రిజిస్టర్ చేసుకున్నారు. ఆ 11 మందీ ఒకే కుటుంబానికి చెందిన అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్ల పిల్లలు. ఒప్పందం ప్రకారం ఆ స్థలంలో 15 లక్షల చదరపు అడుగుల నిర్మిత ప్రాంతం కలిగిన అపార్ట్‌మెంట్లు నిర్మిస్తున్నారు. ఒక్కో బ్లాక్‌లో 10 అంతస్తుల చొప్పున మొత్తం ఆరు బ్లాకుల్లో 2 వేల ఫ్లాట్లు కడుతున్నారు. అంత భారీ ప్రాజెక్టులో స్థల యజమానులు 11 మందికీ కలిపి.. కేవలం 14 వేల 400 చదరవు అడుగులే ఇస్తారట. వారిని నాలుగు గ్రూపులుగా చేసి, ఒక్కో గ్రూపునకు 3 వేల 600 చదరపు అడుగుల చొప్పున ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నారు. ఆ 14 వేల 400 చదరపు అడుగులు కూడా కామన్ ఏరియాతో కలిపి ఇస్తారట.
జీవీఎంసీ అనుమతిచ్చిన ప్లాన్ ప్రకారం డెవలపర్‌కి 15 లక్షల చదరపు అడుగులకు మించి కట్టుకునే వెసులుబాటు వచ్చినా.. భూయజమానుల వాటా 14 వేల 400 చదరపు అడుగులకు మించదట. 51 వేల 159 చదరపు గజాల స్థలంలో భూయజమానులకు వచ్చే అవిభాజ్య వాటా కేవలం 490 చదరపు గజాలు. డెవలప్‌మెంట్ అగ్రిమెంట్ రిజిస్ట్రేషన్ పత్రాల్లోనే.. అక్కడ చదరపు గజం స్థలం విలువ 18 వేల రూపాయలుగా పేర్కొన్నారు. మొత్తం విలువ 92.08 కోట్లు. బహిరంగ మార్కెట్లో ఇది చాలా రెట్లు ఉంటుంది. భూమి వెలతో కలిపి మొత్తం ప్రాజెక్టు విలువను 189.50 కోట్ల రూపాయలుగా పేర్కొన్నారు. స్టాంప్ డ్యూటీగానే 1.89 కోట్లు చెల్లించారు. అంత భారీ ప్రాజెక్టులో భూయజమానులు ఎవరైనా 0.96 శాతంతో సరిపెట్టుకుంటారా అన్నదే అంతుచిక్కని ప్రశ్న.