ఐటీ, విద్యా, నైపుణ్యం, స్టార్టప్ హబ్‌గా ఆంధ్రప్రదేశ్‌ను తీర్చిదిద్దుతామని మంత్రులు ఆదిమూలపు సురేశ్, మేకపాటి గౌతమ్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి జగన్ నాయకత్వంలో విద్య, నైపుణ్య, ఐటీ రంగాలలో అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టామన్నారు. టెక్ మార్క్ ఇండియా సౌజన్యంతో నవంబరు 18,19,20న విశాఖపట్నంలో గ్లోబల్ ఎడ్యుకేషన్, స్టార్టప్ కాంగ్రెస్ ఎక్స్పో సదస్సును నిర్వహించనున్నట్లు తెలిపారు. అందుకు సంబంధించిన బ్రోచర్‌ను మంత్రులు విడుదల చేశారు.
కొవిడ్ సంక్షోభంలోనూ..దేశం మొత్తం ఏపీ వైపు చూసేలా ఇప్పటికే లక్షలాది మందికి ఉద్యోగాలందించామని మంత్రి సురేశ్ అన్నారు. నిరుద్యోగులకు, చదువుకున్న ప్రతి ఒక్కరికి ఉద్యోగాలందించడమే తక్షణ కర్తవ్యంగా ముందుకు సాగుతున్నామన్నారు. మారుతున్న కాలానికి తగ్గట్లు విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామన్నారు. ముఖ్యమంత్రి జగన్ నాయకత్వంలో శ్రీకారం చుట్టిన నాడు-నేడు వంటి ప్రతిష్ఠాత్మక కార్యక్రమానికి దేశవ్యాప్తంగా ప్రశంసలు అందాయన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించేందుకు జాబ్ క్యాలెండర్ విడుదల చేశామన్నారు. పొరుగు రాష్ట్రమైన తెలంగాణ కూడా నాడు-నేడును ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళుతోందని గుర్తు చేశారు. సరికొత్త ఆలోచనలు, ఆవిష్కరణలకు చిరునామాగా ఏపీ నిలవనుందన్నారు.
మరిన్ని ఆవిష్కరణలతో మరింత ముందుకు
ప్రపంచ స్థాయి నాలెడ్జ్‌ని పంచుకుని, మరిన్ని ఆవిష్కరణలతో మరింత ముందుకు వెళ్తామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అన్నారు. రెండేళ్ల కాలంలో విద్య నుంచి ఉపాధి వరకూ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుందన్నారు. కొవిడ్ వల్ల ఊహించని విధంగా టెక్నాలజీ ఆవశ్యకత పెరిగిందన్నారు. సాంకేతికతోనే చిన్నారులకు, యువతకు భవిష్యత్ ఉందని అభిప్రాయపడ్డారు. ఎన్నటికీ వన్నెతరగనిది, విలువ తగ్గనిది సాంకేతిక, విద్య, నైపుణ్యం మాత్రమేనని అన్నారు. విద్యకు, టెక్నాలజీ, నైపుణ్యం జోడించినపుడే మరింత ప్రయోజనం ఉంటుందన్నారు. మునుపటిలా ఇంటర్నెట్ అనేది ఏ కొందరికో కాకుండా ప్రతి ఒక్కరికీ అందాలన్నదే ముఖ్యమంత్రి జగన్ సంకల్పమని గౌతమ్ రెడ్డి అన్నారు. ఐటీ, ఎలక్ట్రానిక్ రంగాల గమ్యస్థానంగా భావించి ఈ 'జీఎస్ యూఈ'ని విశాఖలో నిర్వహించేందుకు శ్రీకారం చుట్టామని పేర్కొన్నారు. డిజిటల్ లైబ్రరీ, ఇంటర్నెట్, టెక్నాలజీ, నైపుణ్యాలకు ఏపీ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని తెలిపారు. నవంబర్ 18, 2021న విశాఖపట్నంలో జరగనున్న గ్లోబల్ ఎడ్యుకేషన్ అండ్ స్టార్టప్ కాంగ్రెస్ అండ్ ఎక్స్ పో (GSUE-2021)ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ, విద్యా శాఖలు సంయుక్తంగా నిర్వహిస్తున్నాయని వెల్లడించారు.