విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నిరసనలు కొనసాగుతున్నాయి. ఉక్కు పరిశ్రమ పరిపాలనా కార్యాలయం వద్ద కార్మికులు నిరసన చేపట్టారు. డైరెక్టర్ ఫైనాన్స్ వేణుగోపాలరావు వాహనాన్ని.. నిరసనకారులు చుట్టుముట్టారు. ఆయన్ను ముట్టడి నుంచి తప్పించేందుకు పోలీసులు యత్నించారు. పరిపాలన కార్యాలయం నుంచి పొట్టి శ్రీరాములు కూడలి వరకు భద్రతా వలయం ఏర్పాటు చేశారు. ఆ వలయం మధ్యే డైరెక్టర్ ఫైనాన్స్ వేణుగోపాలరావు పరిగెత్తారు. పొట్టి శ్రీరాములు కూడలి వద్ద మరోసారి ఆయన్ను నిరసనకారులు చుట్టుముట్టారు. వేణుగోపాలరావుకు మద్దతుగా స్టీల్‌ప్లాంట్ ఉన్నత ఉద్యోగులు తరలివచ్చారు. నిరసనకారులు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది.
మరోవైపు.. ఆందోళనకారులు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేంద్రం ప్రకటనతో ఉన్న ప్రతులను దగ్ధం చేశారు. గాజువాక, అగనంపూడి పరిసరాల్లో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. గాజువాక పోలింగ్ కేంద్రాలకు వెళ్లాల్సిన సిబ్బందికి ఆలస్యమైంది. పోలింగ్ సామగ్రితో సిబ్బంది చేరవేతకు 80 బస్సులు ఏర్పాటు చేశారు. దారిమళ్లింపుతో పీవోలు, ఏపీవోలు సకాలంలో చేరుకోలేకపోతున్నారు. కూర్మన్నపాలెం జంక్షన్ వైపుగా వెళ్లే వాహనాలను దారి మళ్లించారు. ఫార్మాసిటీకి కార్మికులను తీసుకెళ్లే బస్సులు మళ్లించారు. కూర్మన్నపాలెం పరిసరాల్లో రాకపోకలను ఆందోళనకారులు అడ్డుకున్నారు. సింధియా, పాతగాజువాక నుంచి వచ్చే వాహనాలు దారి మళ్లించారు. ఎన్‌ఏడీ మీదుగా లంకెలపాలెం వైపు వాహనాల మళ్లించారు.