WOMEN ATTACK ON ROWDY SHEETER IN VISAKHAPATNAM: విశాఖ మల్కాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో రౌడీ షీటర్ చిన్నారావును మహిళలు చితకబాదారు. పెన్సిల్, పెన్నులు ఆశ చూపించి.. పాఠశాలలో చదివే చిన్నారులపై అత్యాచారానికి యత్నించాడని చిన్నారావుకు దేహశుద్ధి చేశారు. నిందితుడికి గాయాలు కావడంతో అతన్ని కేజీహెచ్‌కు పంపారు. మరికొందరు పిల్లల తల్లిదండ్రులను కూడా విచారణ చేస్తే మరిన్ని నిజాలు వెలుగుచూసే అవకాశం ఉంటుందన్న ఉద్దేశంతో పోలీసులు ఆ కోణంలో వివరాల సేకరణ మొదలుపెట్టారు. అతనిపై పోక్సో కేసు నమోదు చేశారు.
సేవంటూ..
chinnarao welfare society: మల్కాపురం ప్రాంతానికి చెందిన దోమాన చిన్నారావు రౌడీషీటర్. మూడేళ్ల కిందట ‘చిన్నారావు వెల్ఫేర్ సొసైటీ’ పేరుతో ఒక సంస్థను నెలకొల్పారు. నాటి నుంచి పలువురికి సన్మానాలు చేయడం, పోటీలు నిర్వహించడం, బహుమతులు ఇవ్వడం..పాఠశాలల విద్యార్థులకు పుస్తకాలు, అట్టలు, పెన్నులు తదితరాలను ఉచితంగా పంపిణీ చేస్తూ వచ్చారు. ఇటీవల పలువురు ప్రముఖులకు సైతం అవార్డులు అందించారు. ప్రకాశ్‌నగర్ జీవీఎంసీ ఉన్నత పాఠశాల, సమీపంలోని ప్రాథమిక పాఠశాలల్లో ఈ తరహా కార్యక్రమాలు గతంలో చేశారు. ఆయా కార్యక్రమాల వెనుక ఆ రౌడీషీటర్ దుర్భుద్ది ఉందనే విషయం.. సోమవారం నాటి ఘటనతో వెలుగులోకి వచ్చిందని బాధిత కుటుంబీకులు మండిపడ్డారు.
అనుమానం రావడంతో..
గత గురువారం కూడా పాఠశాలకు వెళ్లి చిన్నారులకు బహుమతులు అందించారు. కొందరికి ఇంటికి వస్తే అట్టలు ఇస్తానన్నారు. అతని నైజం తెలియని వారు వెెళ్లారు. తరువాత ట్యూషన్‌కు తోటి విద్యార్థినులతో కాకుండా...ఆలస్యంగా వెళ్లడం..ఆందోళనగా ఉండటంతో టీచర్ కారణమడిగింది. వారు జరిగింది చెప్పారు. మరికొందరు కూడా అదే తరహాలో వివరాలు వెల్లడించడంతో ఆమె సోమవారం ఉదయం జీవీఎంసీ ఉన్నత పాఠశాలకు వెళ్లి ప్రధానోపాధ్యాయుడిని ప్రశ్నించింది. అతని ఇంట్లో జరిగిన విషయాలు తమకు ఎలా తెలుస్తాయని చిన్నారావునే పిలిపిస్తానంటూ ఆయన్ను పాఠశాలకు పిలిపించారు.
ఇంటికి పిలిచి..
పాఠశాలలకు సమీపంలోనే చిన్నారావు నివాసం. కొందరికి బహుమతులు పంపిణీ చేసి మిగిలిన వారిని ఇంటికొచ్చి తీసుకోమనేవారు. అతని నిజస్వరూపం తెలియని పసిపిల్లలు ఉచితమే కదాని ఇంటికి వెళ్లేవారు. ఆ తరువాత వారిపట్ల చాలా అసభ్యకరంగా ..వికృతంగా ప్రవర్తించిన విషయం చర్చనీయాంశమైంది. నాలుగు, ఐదు తరగతులు చదువుతున్న కొందరు విద్యార్థినులు పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. కొందరు బాలికలు తమకు ఏం జరిగిందన్న విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పారు. వారు తమ పరువుపోతుందన్న ఉద్దేశంతో బయటకు చెప్పకుండా కన్నీటిని దిగమింగుకుని అంతులేని ఆవేదన అనుభవించారు. తమలోతామే కుమిలిపోయారు. చివరికి విషయం సోమవారం బయటపడింది.
కట్టలు తెంచుకున్న ఆగ్రహం..