విశాఖ జిల్లా ఆర్.ఆర్.వెంకటాపురంలో ప్రజలను ఉక్కిరి బిక్కిన చేసిన స్టైరీన్ రసాయనం... ఎప్పుడూ ద్రవ రూపంలో ఉండాలని సీఎం జగన్ నిర్వహించిన సమీక్షలో కలెక్టర్ వినయ్ చంద్ తెలిపారు. ఆ రసాయనం ఎప్పుడూ 20 డిగ్రీల ఉష్ణోగ్రతకు లోపే ఉండాలని... అయితే సాంకేతిక లోపం వల్లే రసాయనం వాయు రూపంలోకి మారిందని కలెక్టర్ వివరించారు. ఉదయం 3.45 నుంచి 5.45 మధ్య పరిస్థితి తీవ్రంగా ఉందని వెల్లడించారు. 1.5 కిలోమీటర్ల నుంచి 2 కిలోమీటర్ల వరకు ప్రాంతం స్టైరీన్ రసాయనంతో ప్రభావితమైందని కలెక్టర్ పేర్కొన్నారు.
మరోవైపు ఈ ఘటనపైఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ డైరెక్టర్ పూర్ణ చంద్ర మోహన్ రావు స్పందించారు. లాక్‌డౌన్ తమ పరిశ్రమకు శాపంగా మారిందని ఆయన అన్నారు. స్టైరెన్ మోనోమర్ అనేది నిరంతరం నిర్వహణలో ఉండాలని... అలా ఉండకపోవడం వల్ల తలెత్తిన సమస్యలే ప్రమాదానికి దారి తీశాయని చెప్పారు. పరిస్థితి మొత్తం అదుపులోకి వచ్చాకే అధికారులు, ప్రజలకు స్పష్టతనిస్తామని తెలిపారు.