మిషన్ సాగర్ - 6 పేరిట భారత యుద్ధ నౌక జలశ్వ ద్వారా.. వెయ్యి మెట్రిక్ టన్నుల బియ్యం కొమోరస్లోని అంజౌన్ పోర్టుకు చేరినట్లు నేవీ అధికారులు తెలిపారు. కొమోరస్ ప్రభుత్వానికి సహాయంగా భారత్ ఈ బియ్యాన్ని అందిస్తోందని చెప్పారు. అధికారికంగా అక్కడ జరిగిన సమావేశంలో ఆ దేశ విదేశాంగ మంత్రి డి.దేవకమల్, నౌకా, విమాన యాన మంత్రి జె.చాన్ఫీ పాల్గొన్నారు.
భారత నావికాదళం నుంచి జలాశ్వ కమాండింగ్ అధికారి కెప్టెన్ పంకజ్ చౌహాన్ వారితో భేటీ అయ్యారు. మన దేశానికి చెందిన ఓ యుద్ధనౌక మరోదేశానికి ఏడాదిలో రెండోసారి వెళ్లింది. మిషన్ సాగర్-4 పేరిట భారత ప్రభుత్వం ఇది వరకే ఆ దేశానికి 1000 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని అందించింది. గతంలో మిషన్ సాగర్-1లో ఐఎన్ఎస్ జలశ్వ కీలక పాత్ర పోషించింది.