తొమ్మిది వేల వంద టన్నుల కార్గో రవాణా ద్వారా విశాఖలోని వాల్తేర్ రైల్వే డివిజన్ కొత్త రికార్డు నెలకొల్పింది. కొవిడ్ సమయంలోనూ తనదైన ముద్ర వేసింది. కాలపట్టిక ప్రకారం పార్శిల్ ఎక్స్‌ప్రెస్ సర్వీసులను నడిపి వినియోగదార్లకు చేరువ కాగలిగింది. ఇప్పటివరకు 603 ట్రిప్పులు సరుకు చేరవేసింది. ఆహార పదార్ధాలు, పప్పు దినుసులు, మందులు, వైద్య పరికరాలు, చేపలు, పండ్లు, గోనె సంచులు, కూరగాయలతో పాటు ఇతర నిత్యావసర సామగ్రిని దేశంలోని వివిధ ప్రాంతాలకు బట్వాడా చేసింది.
ఈ ఏడాది ఏప్రిల్ రెండవ తేదీ నుంచి ఇప్పటివరకు.. దేశంలో వివిధ ప్రాంతాలకు 6,344 టన్నుల పార్శిళ్లను ఎగుమతి చేసింది. 2,760 టన్నుల సరుకును డివిజన్‌కి దిగుమతి చేసింది. మామిడి పండ్లు 4,346 టన్నులు, మందులు పరికరాలు 15 టన్నులు, ఇతర పండ్లు కూరగాయలు 98 టన్నులు, చేపలు వాటి మేత 885 టన్నులు, పాల ఉత్పత్తులు గుడ్లు 94.3 టన్నులు, ఇతర వస్తువులు 904.5 టన్నులు వాటిలో ఉన్నాయి.