నక్సల్స్‌కు వ్యతిరేకంగా మన్యంలో గోడ పత్రికలు - wallposters against naxals in vishakha agency
నక్సల్స్‌కు వ్యతిరేకంగా విశాఖ మన్యం చింతపల్లిలో గోడ పత్రికలు వెలిశాయి. అల్లూరి ఆదివాసీ అభివృద్ధి సమితి పేరుతో... వెలిసిన ఈ పత్రికల్లో గిరిజనుల అభివృద్ధికి నక్సల్స్ ఆటంకంగా మారారని పేర్కొన్నారు.
నక్సల్స్ వైఖరికి వ్యతిరేకంగా అల్లూరి ఆదివాసీ అభివృద్ధి సమితి పేరుతో మన్యంలో ఇవాళ ప్రత్యక్షమైన గోడ పత్రికలు కలకలం సృష్టించాయి. రోడ్లు వేసేందుకు ప్రయత్నిస్తే వాహనాలను తగలబెడుతూ, సెల్ టవర్లను ధ్వంసం చేస్తూ గిరిజనుల అభివృద్ధికి నక్సల్స్ ఆటంకంగా మారారని అందులో పేర్కొన్నారు. సమాజ అభివృద్ధికి మూలమైన రహదారులు లేక... విద్య, వైద్యం అన్నీ గిరిజనానికి దూరమయ్యాయన్నారు. మీ మనుగడ కోసం పాఠశాలలు, సంతలకు పోనీయకుండా ఆంక్షలు విధించడమేనా, గిరిజనులకు మద్దతంటే అని ప్రశ్నించారు. ఇప్పటివరకూ ఇన్ఫార్మర్ల నెపంతో ఎంతో మందిని హతమార్చారని ఆ పత్రికలో పేర్కొన్నారు. హక్కుల కోసం మేమే పోరాటం చేసుకుంటామని స్పష్టం చేశారు. చింతపల్లి పట్టణ కేంద్రంలో ఆర్టీసీ కాంప్లెక్స్, హనుమాన్ జంక్షన్, శివాలయం టెంపుల్, సామాజిక ఆరోగ్య కేంద్రం ప్రాంతాల్లో ఈ కరపత్రాలు దర్శనమిచ్చాయి.