'అనుమతి పొందిన భూముల్లో పేదలకు పట్టాలా?' - PARAWADA GOVT LANDS ISSUE
ఎప్పుడో అనుమతి పొందిన వుడా లే అవుట్లలో ప్రభుత్వ భూమి ఉందంటూ పేదల ఇళ్లపట్టాల కోసం జిల్లా యంత్రాంగం సిద్దం చేయడం ప్లాట్ల యజమానులను నిశ్చేష్టులను చేస్తోంది. లాక్ డౌన్ సమయంలో విశాఖ జిల్లా పరవాడ తాహసీల్దార్ పరిధిలోని దేశపాత్రుని పాలెం వుడా లేఅవుట్ లో రెవెన్యూ అధికార్ల నిర్వాకం ఇక్కడి ప్లాట్ల కొనుగోలు దార్లను తీవ్ర వేదనకు గురి చేసింది. జేసీబీని తీసుకువచ్చి ఇక్కడ ఉన్న నివాసాలను కూడా కూలగొట్టడం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు. న్యాయపోరాటానికి వీరు సిద్దమయ్యారు.
విశాఖ నగరానికి అనుకుని ఉన్న పరవాడ మండలంలో ఎప్పటినుంచో నివాస ప్రాంతాలకు వుడా కాలనీలను అభివృద్ది చేసింది. ప్లాట్లను అన్ని అనుమతులతో లేఅవుట్లను రూపొందించింది. ఇటువంటిదే 1988లో దేశపాత్రుని పాలెంలో సుబ్బలక్ష్మీ నగర్ వుడా లే అవుట్. దాదాపు ఇప్పటికి 42 ఏళ్ల క్రితం ఏర్పాటైన లేఅవుట్ పూర్తి స్ధాయి వుడా అనుమతులతో... 300 ప్లాట్లు ఎన్నోసార్లు క్రయవిక్రయాలు జరిగిపోయాయి. ఇందులో ప్రభుత్వ భూమి ఉందంటూ హఠాత్తుగా ఇప్పుడు రెవెన్యూ యంత్రాంగం ఉన్న భవనాలను తొలగించి చదును చేసేసి పేదల పట్టాల కోసం సిద్దం చేసింది. ఒకవైపు లాక్ డౌన్ అమల్లో ఉండగానే 25 మంది కూలీలను, జేసీబీని పెట్టించి ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా అనుమతి ఉన్న లేఅవుట్ లో ఈ రకంగా చేయడం పై ప్లాట్ల యజమానులు తీవ్ర వేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఉన్నతాధికార్లను సంప్రదిస్తే అటువంటి పనులు లాక్ డౌన్ సమయంలో చేయడానికి వీలులేదని చెబుతున్నారని... కింది స్థాయి యంత్రాంగం మాత్రం తమకు ఈ రకంగా చేయమని ఒత్తిడి ఉందని చెబుతున్నారు. దీనిపై బాధితులు ఉన్నత న్యాయస్దానాన్ని ఆశ్రయిస్తామంటున్నారు.