విశాఖ మహాప్రాంత అభివృద్ధిసంస్థ-VMRDA(వీఎంఆర్డీఏ)కు రహదారుల మార్పుపైనే ప్రజల నుంచి ఎక్కువగా అభ్యంతరాలు వచ్చాయి. ఆ తర్వాత భూవినియోగాలను మార్చాలంటూ అధిక మంది విజ్ఞప్తి చేశారు. ఆనందపురం మండలంలో గంభీరం, వేములవలస మరికొన్ని ప్రాంతాలను గ్రీన్‌బెల్ట్‌లో చేర్చడంతో.. అభ్యంతరం వ్యక్తం చేశారు. బహుళ వినియోగ ప్రాంతంలో గ్రీన్‌బెల్ట్ పెట్టాలని విజ్ఞప్తి చేశారు. భీమిలి, భోగాపురం మండలాల్లో ఎక్కడికక్కడ కొత్త మాస్టర్‌ప్లాన్ రోడ్లను చూపించారని ఫిర్యాదు చేశారు. నగరంలో రక్షిత అడవిలో రహదారి, జలవనరుల మీదుగా కొన్ని రోడ్లు వెళ్లేలా ప్లాన్ చేశారని.. నగరంలో కొన్ని చోట్ల ప్రైవేటు భూములను ప్రజా రవాణా ప్రాంతాలుగా పేర్కొన్నారని అభ్యంతరం వ్యక్తం చేశారు. చాలాచోట్ల వ్యవసాయ భూములను వ్యవసాయేతర, నివాస ప్రాంతాలను గ్రీన్‌బెల్ట్‌లోకి ప్రతిపాదించడాన్ని ప్రజలు వ్యతిరేకించారు.
ఆయా మండలాల్లో కొందరు దళారులు ఇదే పనిగా ప్రజలను మభ్యపెడుతున్నారు. స్థలాలు, ఇళ్లు, పొలాలు పోతాయని భయాందోళనకు గురి చేస్తున్నారు. ఇందులో స్థానిక నాయకులు రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఉన్నారు. మధ్యవర్తుల సాయంతో తక్కువ ధరకు ఆ భూములను కొనుగోలు చేసేందుకు ప్రణాళిక రచిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. అదేవిధంగా ఇళ్లు, పొలాల మీదుగా వెళ్తున్న ప్రతిపాదిత రోడ్లను... అలైన్‌మెంట్ మార్పిస్తామని... నమ్మబలికి కొంత మంది దళారులు ప్రజల నుంచి వసూళ్లకు పాల్పడుతున్నారు. మరికొంతమంది ప్రజలను ఆందోళనకు గురిచేసి తక్కువ ధరకు భూమి కొనుగోలు చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.