రాష్ట్రంలో రెండో అతిపెద్ద పట్టణాభివృద్ధి ప్రాంతమైన విశాఖ మెట్రోపాలిటన్ రీజియన్ అభివృద్ధి సంస్థ.... 6 వేల 501 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. గతంలో రూపొందించిన వీఎంఆర్డీఏ బృహత్ ప్రణాళిక 2021 సంవత్సరంతో ముగియనుండగా... తిరిగి వచ్చే 30 సంవత్సరాలకు అభివృద్ధి స్వప్నాన్ని ఆవిష్కరించనున్నారు. ప్రణాళిక రూపకల్పన బాధ్యతలను లీ అనే సంస్థకు అప్పగించారు. ఇందులో భాగంగా విజయనగరం కలెక్టరేట్‌లో నిర‌్వహించిన ఒకరోజు కార్యశాలలో.... వీఎంఆర్డీఏ ఛైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాసరావు, కమిషనర్ కోటేశ్వరరావు, జిల్లా కలెక్టర్ హరిజవహర్ లాల్, వివిధ శాఖల అధికారులు, లీ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. వీఎంఆర్డీఏ పరిధి, అందులోని రోడ్డు, జల, రైలు మార్గాలు, పర్యాటక ప్రాంతాల వివరాలను లీ సంస్థ ప్రతినిధులు... పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. రవాణా, పర్యాటకం, విద్య, పర్యావరణం, వినోదం, పరిశ్రమలులాంటి కీలక అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకొని మాస్టర్ ప్రణాళిక-2051 రూపొందిస్తామని అధికారులు తెలిపారు.
వీఎంఆర్డీఏ మాస్టర్ ప్రణాళిక-2051 రూపకల్పనలో విజయనగరం జిల్లా ప్రజల ఆకాంక్షలను కూడా పరిగణనలోకి తీసుకోవాలంటూ స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు అనేక సూచనలు చేశారు.