Vizianagaram District Bifurcation: ఆంధ్రప్రదేశ్‌లో అతి తక్కువ వయస్సు ఉన్న జిల్లా విజయనగరం. 1979లో ఏర్పడిన ఈ జిల్లా ఇప్పుడు రెండు జిల్లాలుగా మారుతోంది. జిల్లాలోని పార్వతీపురం పార్లమెంటు పరిధి ప్రాంతంతో పాటు, మరికొన్ని ప్రాంతాలతో కొత్తగా 'మన్యం' జిల్లాగా ఏర్పాటు కానుంది. పార్వతీపురం కేంద్రంగా ఈ మన్యం జిల్లా ఏర్పాటు కానుంది. జిల్లాల విభజనలో పార్లమెంట్ పరిధి కంటే అసెంబ్లీ స్థానాల సర్ధుబాటుకే ప్రాధాన్యం ఇచ్చినట్లు కనిపిస్తోంది.
విజయనగరం జిల్లా 1979 జూన్ 1న ఏర్పడింది. అప్పట్లో శ్రీకాకుళం జిల్లాలోని కొంత భాగాన్ని... విశాఖ జిల్లాలోని కొన్ని మండలాలను కలిపి 34 మండలాలతో విజయనగరం జిల్లాను ప్రకటించారు. మళ్లీ 43ఏళ్ల తర్వాత జిల్లా స్వరూపం మారుతోంది. పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా జిల్లాలు ఏర్పాటు చేస్తున్నందున అసెంబ్లీ నియోజక వర్గాలను చీల్చకుండా పునర్విభజనకు ప్రభుత్వం మొగ్గు చూపింది. ప్రస్తుతం విజయనగరం జిల్లా తొమ్మది అసెంబ్లీ స్థానాలు, మూడు పార్లమెంట్ స్థానాల పరిధిలో విస్తరించి ఉంది. కురుపాం, పార్వతీపురం, సాలూరు నియోజకవర్గాలు అరకు పార్లమెంట్ పరిధిలో ఉంటే.. విజయనగరం, నెల్లిమర్ల, గజపతినగరం, బొబ్బిలి, చీపురుపల్లి నియోజకవర్గాలు విజయనగరం పార్లమెంట్ పరిధిలో ఉన్నాయి. ఇక విజయనగరం పార్లమెంటు పరిధిలోనే శ్రీకాకుళం జిల్లాలోని రాజాం, ఎచ్చెర్ల నియోజకవర్గాలు కూడా ఉన్నాయి. జిల్లాలోని శృంగవరపుకోట నియోజకవర్గం విశాఖ పార్లమెంట్ పరిధిలో ఉంది.
ఇదీ చదవండి:ఇళ్లలోనే పాల నాణ్యతను ఇలా గుర్తించవచ్చు...
Vizianagaram District Assembly Constituencies : పునర్విభజన తర్వాత విజయనగరం పేరుతోనే కొనసాగే జిల్లాలో విశాఖ పార్లమెంట్ పరిధిలోని శృంగవరపుకోటతో పాటు విజయనగరం, గజపతినగరం, నెల్లిమర్ల, చీపురుపల్లి, బొబ్బిలి అసెంబ్లీ స్థానాలు ఉంటాయి. శ్రీకాకుళంజిల్లాలోని రాజాం కూడా విజయనగరం జిల్లాలో ఉంటుంది. విజయనగరం ఎంపీ స్థానంలోని ఎచ్చెర్ల నియోజకవర్గాన్ని మాత్రం శ్రీకాకుళం జిల్లాలోనే ఉంచారు. విజయనగరంజిల్లా నుంచి పార్వతీపురం ఎంపీ పరిధిలోని నియోజకవర్గాలతో 'మన్యం' జిల్లాగా ఏర్పాటు కానుంది. జిల్లాలోని పార్వతీపురం, సాలూరు, కురుపాం నియోజక వర్గాలతో పాటు శ్రీకాకుళం జిల్లాలోని పాలకొండ నియోజకవర్గాలతో కొత్తగా ఈ మన్యం జిల్లా ఏర్పాటు కానుంది. ఇందులో అన్నీ ఎస్టీ రిజర్వుడ్ స్థానాలే ఉన్నందున 'మన్యం' జిల్లాగా నామకరణం చేశారు. పార్వతీపురం ఈ జిల్లా కేంద్రం. అరకు ఎంపీ స్థానం నాలుగు జిల్లాల్లో విస్తరించి ఉండటం, దూరాభారం కారణంగా ఈ పునర్విభజన చేశారు.
"పార్వతీపుర నియోజక వర్గ ప్రజల గత దశాబ్ధాల ఆశ,ఆలోచనలకు తగినట్టుగా సీఎం జగన్మోహన్ రెడ్జి పాలిస్తున్నారనటానికి నిదర్శనమే ఆయన పాలన" -అలజంగి జోగారావు, పార్వతీపురం ఎమ్మెల్యే
పార్వతీపురం ఐటీడీఏ కార్యాలయం కోసం ఆధునిక హంగులతో కొత్త భవనాన్ని నిర్మిస్తున్నారు. ఇందులోనే మన్యం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఏర్పాటు చేసే అవకాశం ఉంది. జిల్లా పోలీసు శాఖ కార్యాలయం కోసం వైకేఎంకాలనీలోని యువ శిక్షణ కేంద్రాన్ని పరిశీలించారు. జిల్లా న్యాయస్థానానికి అవసరమైన వసతులు, వనరులు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇక్కడే అదనపు జిల్లా న్యాయమూర్తి కోర్టు కూడా నడుస్తుండండటం మరో కలిసొచ్చే అంశం. శృంగవరపుకోట నియోజకవర్గ ప్రజల్లో కొంత అసంతృప్తి వ్యక్తమవుతోంది. విశాఖ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఉన్న తమ ప్రాంతాన్ని ఆ జిల్లాలోనే విలీనం చేయాలని కోరుతున్నారు.