గడచిన ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్దాయిలో కార్గోను హ్యాండిల్ చేసి దేశంలోని పోర్టులలో తొలి మూడింటిలో నిలిచిన విశాఖ పట్నం పోర్టు కొవిడ్ సమయంలోనూ తనదైన ప్రత్యేకతను కనబరుస్తోంది. కొవిడ్ గాయం నుంచి కొలుకునే యత్నాలను చేస్తూనే... మౌలిక సదుపాయాలను విస్తరించుకునేందుకు ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వానికి పంపింది. విశాఖ పోర్టు నవీకరణ కోసం దాదాపు రూ.నాలుగు వేల కోట్ల వరకు ఖర్చు చేస్తున్నామని పార్లమెంట్లో లిఖితపూర్వకంగా నౌకాయాన మంత్రిత్వ శాఖ సమాధానమిచ్చింది.
రహదారి విస్తరణ
పోర్టులో కార్గో పెంచేందుకు రహదారి విస్తరణ అవసరమవుతుంది. ఇందుకు తాజాగా పోర్టు ప్రతిపాదనలు సమర్పించింది. ప్రస్తుతం పోర్టుకి వచ్చే నాలుగు లైన్ల రహదార్లపై భారీ సరకు లారీల రాకపోకలు పెరిగాయి. వీటి రద్దీకి అనుగుణంగా మరో నాలుగు లైన్ల అభివృద్దికి ప్రతిపాదనలు సిద్ధం చేశామని పోర్టు ఛైర్మన్ కె.రామ్మోహనరావు వెల్లడించారు.
పై వంతెనకు ప్రతిపాదన
విశాఖ పోర్టుకి ముడి సరకు రవాణా కోసం దాదాపు 16 వరకు రైల్వే లైన్ల ట్రాక్‌లు ఉన్నాయి. నిత్యం ఇవి రాకపోకలు సాగిస్తుండడం వల్ల సాధారణ వాహనాల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. దీనిని అధిగమించేందుకు పై వంతెన నిర్మాణాన్ని కూడా పోర్టు ప్రతిపాదించింది. కొత్త కార్గో ద్వారా ప్రస్తుతం ఉన్న ట్రాఫిక్‌ను మరింత పెంచేందుకు యత్నిస్తున్న విశాఖ పోర్టుకు ఈ మౌలిక సదుపాయాలు విస్తరిస్తే మరింత ప్రయోజనం కానుంది.