విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టుకు కొత్త రూపు విశాఖ మెట్రో ప్రాజెక్టులో మళ్లీ కదలిక వచ్చింది. 'లైట్ రైల్ మెట్రో'గా దీనిని తెరపైకి తీసుకురావడం వల్ల ప్రాజెక్టు వ్యయంలో రెండు వేల కోట్ల రూపాయలు తగ్గినట్లు అధికారులు తెలిపారు. దీనిని రూ.8,300 కోట్లతో పూర్తి చేసే విధంగా తాజా ప్రతిపాదనలను పట్టాలెక్కించేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ.. ప్రజా ప్రతినిధులు, కలెక్టర్, వీఎంఆర్డీఐ అధికారుల బృందంతో ప్రతిపాదిత ప్రదేశాల్లో క్షేత్ర స్థాయి పరిశీలన చేశారు.
42 నుంచి 140 కిలోమీటర్ల వరకూ పెంపు
గతంలో కేవలం 42 కిలోమీటర్లకే మెట్రో రైల్ ప్రాజెక్టు నిర్మించేందుకు నిర్ణయించారు. దాని వల్ల వ్యయం తప్ప మరో ఉపయోగం లేకపోవటంతో ప్రతిపాదనలో మార్పులు చేస్తూ ఇప్పుడు 140 కిలోమీటర్ల వరకూ పెంచారు. దీనిపై ముఖ్యమంత్రి సమీక్ష తర్వాత తుది ప్రతిపాదనలతో టెండర్స్ పిలవనున్నారు. ఇందులో ప్రధానంగా సాగర తీరం వెంబడి పాత నగరం నుంచి రుషి కొండ వరకు 'ట్రాక్ లెస్ ట్రామ్' వంటి ప్రతిపాదన చేర్చారు. దీని వల్ల విశాఖ సాగర తీరం అందాలను వీక్షించే అవకాశం కలుగుతుంది.ఎంతోకాలంగా ఊరిస్తోన్న మెట్రో రైల్ ప్రతిపాదనను కొత్త రూపులో పట్టాలెక్కించే ప్రయత్నంలో వీఎంఆర్డీఏ ప్రధాన భాగస్వామి కానుంది.
ఇవీ చదవండి:
రక్షణకు హద్దులు లేవు.. జీరో ఎఫ్ఐఆర్ ఉందిగా..!