విశాఖ తీరప్రాంత అభివృద్ధికి జీవీఎంసీ నడుం బిగించింది. ఆర్‌కే. బీచ్ నుంచి భీమిలి వరకు తీర ప్రాంతాన్ని పర్యటకంగా, పటిష్టంగా అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపట్టింది.
బ్రెజిల్ తరహాలో రాతిబాట
బ్రెజిల్‌లోని రియో డిజనీరో నగరంలోని బీచ్‌లో వందేళ్ల క్రితం రాతిముక్కలతో వేసిన ‘పోర్చుగీసు తీరబాట’ ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉంది. రాళ్లతో ఆకట్టుకునే డిజైన్లు రూపొందించారక్కడ. ఈ తరహాలో విశాఖ తీరం వెంబడి 27కి.మీ పాటు నడకబాట వేసేందుకు ఓ ప్రతిపాదన ఉంది. సూర్యకిరణాలకు ఏమాత్రం వేడెక్కని తరహాలో వినూత్న టైల్స్‌తో తీరం వెంట బాట వేయాలని మరో ప్రతిపాదనగా ఉంది. చెప్పులు లేకున్నా ఇందులో హాయిగా తిరిగే సౌకర్యముంటుంది. పై రెండింటిలో విశాఖకు అనువుగా ఉండే ఒక ప్రతిపాదనను అంగీకరించే అవకాశముందని జీవీఎంసీ అధికారులు తెలిపారు.
చైనా మాదిరిగా సేదతీరే ప్రాంతాలు
చైనాలోని హాంకాంగ్ బీచుల్లో పలుచోట్ల కూర్చునేందుకు, సేద తీరేందుకు వీలుగా విశాల ప్రాంతాల్ని ఏర్పాటు చేశారు. ఈ తరహాలో విశాఖ ఆర్‌కేబీచ్‌తో పాటు రుషికొండ, తెన్నేటి పార్క్, భీమిలి బీచ్‌ల్లోని స్థలాల్ని వృద్ధిచేయాలని జీవీఎంసీ ప్రతిపాదించింది. బీచ్‌కి అభిముఖంగా పచ్చికలు, బల్లలు విరివిగా పెట్టాలని యోచిస్తోంది.
ఆర్‌కే బీచ్ పటిష్ఠం
ప్రపంచ బ్యాంకు నిధులతో ఆంధ్రప్రదేశ్ విపత్తు పునరుద్ధరణ ప్రాజెక్ట్ (ఏపీడీఆర్‌పీ)లో భాగంగా ప్రస్తుతం రూ.116 కోట్లతో ఆర్‌కేబీచ్‌ను వృద్ధిచేస్తున్నారు. తీరం కోతకు గురికాకుండా సుమారు 3 కి.మీ పొడవున బలమైన అడ్డుగోడ (రిటైనింగ్ వాల్)ను నిర్మించే పనులు మొదలయ్యాయి. ఇప్పుడున్న రోడ్లను రీడిజైన్ చేయనున్నారు. తీరం వెంబడి 11మీటర్ల మేర నడకబాటను వేయనున్నారు. దానికి అనుబంధంగా సైకిల్‌బాట, ప్రత్యేకించిన ప్రదేశాల్లోనే దుకాణాలు, పలు వ్యూపాయింట్లు రానున్నాయి.
విశాఖలోని ఆర్‌కే బీచ్ నుంచి భీమిలి బీచ్ వరకు 27కి.మీ తీరప్రాంతముంది. దీన్నంతటినీ వృద్ధిచేసేందుకు ప్రణాళిక సిద్ధమవుతోంది. తుపాన్ల నుంచి రక్షణ పొందేందుకు తొలి ప్రాధాన్యంగా తీర రక్షణను కట్టుదిట్టం చేసేలా ప్రతిపాదిస్తున్నారు. విశాఖ నుంచి భీమిలి వరకు మొత్తం తీరాన్ని సర్వే నిర్వహించి ఎక్కడెక్కడ బలహీనంగా ఉందో గుర్తించి అక్కడ అడ్డుగోడలు నిర్మించేందుకు నిర్ణయం తీసుకున్నారు.