విశాఖపట్నం మధురవాడ ఎన్జీఓస్ కాలనీలో... 30 ఏళ్ల వయస్సున్న వ్యక్తిని దుండగులు దారుణంగా హత్య చేశారు. ఆ వెంటనే పరారయ్యారు. మంగళవారం రాత్రి కాలనీలో నడచి వెళ్తున్న ఆ వ్యక్తిని దుండగులు వెనుక నుంచి మెడ భాగంలో కత్తితో నరికి పరారైనట్లు తెలుస్తోంది. కొన ఊపిరితో ఉన్న బాధితుడిని స్థానికులు రుషికొండలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.
అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. డాగ్‌స్క్వాడ్ బృందంతో కాలనీలో గాలింపు చర్యలు చేపట్టారు. మృతుడితోపాటు హత్యకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా లభ్యం కాలేదని పోలీసులు పేర్కొన్నారు.