బీచ్ రోడ్డులో ఉన్న ఆకర్షణలను చూసేందుకు విశాఖకు ఏటా కోటి మంది పర్యాటకులు వస్తున్నారన్నది పర్యాటక శాఖ అంచనా. ఆర్కే బీచ్ నుంచి భీమిలి వరకూ 30 కిలోమీటర్ల పొడవునా ఎన్నో విశేషాలు సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. పర్యాటక విధానం 2020-25 ప్రకారం. పీపీపీ ద్వారా మరిన్ని ఆకర్షణలు తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. పరిపాలనా రాజధానిగా విశాఖ, భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం మరింత కలిసి రానున్నాయి. తీరప్రాంత రహదారి అభివృద్ధిలో భాగంగా విశాఖ నుంచి భోగాపురం వరకూ రహదారి విస్తరణకు ప్రణాళిక సిద్ధం చేశారు.
విశాఖ బీచ్ కారిడార్ ప్రాజెక్టును 570 ఎకరాల్లో దాదాపు 1050 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్నారు. ఇందులో భాగంగా తెన్నేటి పార్క్ వద్దకు కొట్టుకొచ్చిన బంగ్లాదేశ్ నౌకను కొనుగోలు చేసి సుమారు పదిన్నర కోట్లతో ఆకర్షణీయ ఫ్లోటింగ్ హోటల్‌గా మార్చనున్నారు. తొట్లకొండలో ధ్యానమందిరాలను నిర్మించనున్నారు. గోస్తని వద్ద హ్యాంగింగ్ వంతెనను ఏర్పాటు చేయనున్నారు. ఇందిరాగాంధీ జంతుప్రదర్శన శాలను 138కోట్లతో మెరుగుపర్చనున్నారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద దిల్లీ తరహాలో ఎరోపొలిస్ ను నిర్మిస్తారు. 400 ఎకరాలను దీనికి కేటాయించనున్నారు.