ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు'.. నిరంతర స్ఫూర్తి రగిల్చే నినాదం - vishaka steel plant issue latest news

విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు నినాదం.. ఓ మహోజ్వల ఉద్యమ స్ఫూర్తికి పునాది వేసింది. చల్లారని ఉక్కు సంకల్పానికి నాంది పలికింది. ప్రస్తుతం ప్రైవేటీకరణ చేయాలన్న నిర్ణయానికి వ్యతిరేకంగా అదే స్ఫూర్తితో ఉద్యమం రగిలింది. రాష్ట్రీయ ఇస్పాత్ నిగం లిమిటెడ్‌గా ఉన్న విశాఖ ఉక్కు పరిశ్రమ మనుగడను కాపాడుకునే పోరాటం ఊపందుకుంది. నాటి త్యాగధనుల ఉక్కు స్థైర్యాన్ని కొనసాగిస్తూ దేశ సంపదగా, జాతీయతా భావానికి చిహ్నంగా ఆర్​.ఐ.ఎన్​.ఎల్ ను నిలబెట్టే ఉద్యమం ఉరకలేస్తోంది. ఆర్​.ఐ.ఎన్​.ఎల్ ఆవిర్భావ దినోత్సవం వేళ ప్రత్యేక కథనం.

vishaka steel plant issue
vishaka steel plant issue

By

Published : Feb 18, 2021, 11:39 AM IST

ఆంధ్రుల ఆత్మ గౌరవానికి ప్రతీక విశాఖ ఉక్కు కర్మాగారం. 32 మంది ప్రాణ త్యాగాలు, అవిశ్రాంత ఉద్యమాలతో పోరాడి సాధించుకున్న పరిశ్రమగా ఖ్యాతి ఉంది. దేశంలో తీర ప్రాంత ఉక్కు కర్మాగారం ఇదొక్కటే. ఉక్కు పరిశ్రమ అంటే లాభ నష్టాల గణాంకాలు, రాజకీయ సమీకరణాలు కాదు.అమృతరావు వంటి త్యాగధనుల పోరాటానికి నిలువెత్తు నిదర్శనం. భూమే సర్వస్వంగా భావించే రోజుల్లో పారిశ్రామికీకరణ పై అవగాహన లేని కాలంలో.. వేల మంది తమ సాగు భూములను త్యాగం చేశారు. పునరావాసం, ఉద్యోగం హామీతో. నామమాత్రపు పరిహారం తీసుకుని.. సరికొత్త అధ్యాయానికి నాటి రైతులు శ్రీకారం చుట్టారు. నాటి నుంచి అనేక అడ్డంకుల్ని అధిగమిస్తూ.. ఆటుపోట్లను తట్టుకున్న విశాఖ స్టీల్‌ ప్లాంట్‌... ప్రైవేటుకి దీటుగా నిలిచింది. కానీ ప్రస్తుతం నష్టాల పేరుతో తన ఉనికిని ప్రశ్నార్థక స్థితిలో నిలుపుకుంది.

ప్రైవేటు సవాళ్లు విశాఖ ఉక్కుకు కొత్తేంకాదు. వాజ్‌పేయీ హయాంలోనూ ప్రైవేటు ఉచ్చు బిగించే ప్రయత్నం జరిగింది. నాటి సీఎం చంద్రబాబు, ఎంపీలు యర్రంనాయుడు, ఎంవీవీఎస్ మూర్తి పోరాట ఫలితంగా ఆ గండం తప్పింది. వాజ్ పేయీ సానుకూల దృక్పథంతో స్టీల్ ప్లాంట్ కు ఆర్థికంగా అందించిన చేయూత...తర్వాతి కాలంలో పరిశ్రమ వేల కోట్ల రూపాయల లాభాల్లోకి వెళ్లేందుకు సహకరించింది. 7.3 మిలియన్ టన్నుల సామర్థ్యానికి చేరుకున్నా.. పరిశ్రమకు కనీస అవసరమైన ఇనుప ఖనిజ గనుల కేటాయింపు జరగలేదు. సొంత గనులు లేక ఏటా పడే ఆర్థిక భారం 3వేల కోట్ల రూపాయలకు పైమాటే. రుణాలకు జతవుతున్న వడ్డీల భారం స్టీల్ ప్లాంట్ ను ఆర్థికంగా కుంగదీసింది. అయినప్పటికీ ఉత్పత్తి, మార్కెటింగ్ సంబంధిత అంశాల్లో విశాఖ ఉక్కు ఇప్పటికీ ఎంతో పటిష్ఠంగా ఉంది. కొవిడ్ కాలంలో అన్ని పరిశ్రమలు నష్టాల బాట పడితే.. ఇక్కడ మాత్రం 200 కోట్ల రూపాయల మేర లాభాలు వచ్చాయి.

విశాఖ ఉక్కు నాణ్యతలో రారాజు.. ఉద్యోగులకు అద్భుత జీవన ప్రమాణాలు అందించే విషయంలోనూ మేటి. అందుకే జీవితంపై ఎన్నో కలలతో ఇక్కడ కొలువు సాధించేందుకు యువత పోటీ పడతారు. ఒక పరిశ్రమగా తాను ఎదుగుతూనే అనేక అనుబంధ పరిశ్రమలకు ఊతమిచ్చింది. విశాఖ నగరాభివృద్ధిలోనూ స్టీల్ ప్లాంట్ భాగస్వామ్యాన్ని వెలకట్టలేం. ఆర్​.ఐ.ఎన్​.ఎల్ పరిరక్షణ దిశగా జరుగుతున్న ప్రస్తుత ఉద్యమాలు ప్రైవేటీకరణకు అడ్డుకట్ట వేయడమే కాక.. మౌలికంగా పరిశ్రమ ఎదుర్కొనే వివిధ సమస్యలను పరిష్కరించే దిశగా మార్గాలు చూపాలని కార్మికవర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

ఇదీ చదవండి:'ఫలితాలు తారుమారు చేశారు.. చర్యలు తీసుకోండి'

ABOUT THE AUTHOR

...view details