ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

నాటి ఉక్కు ఉద్యమానికి రాజీనామాలతో ఊపిరి

విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ దిశగా అడుగులు పడుతున్న నేపథ్యంలో.. నాడు కర్మాగార సాధన కోసం ఉవ్వెత్తున జరిగిన ఉద్యమాన్ని పలువురు గుర్తుచేసుకుంటున్నారు. నాడు రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ఉద్యమానికి పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా బాసటగా నిలిచారు. కేంద్రం ముందే చెప్పినట్లు విశాఖలోనే ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేయకపోతే తమ పార్టీ సభ్యత్వాలకు రాజీనామాలు చేస్తామన్నారు. అయినా ఫలితం లేకపోవడంతో శాసనసభ, పార్లమెంటు సమావేశాలు ప్రారంభమైన సందర్భంగా పలువురు తమ పదవులకు రాజీనామాలు చేశారు.

vishaka steel plant
vishaka steel plant

By

Published : Feb 12, 2021, 7:06 AM IST

నాటి ఉక్కు ఉద్యమానికి రాజీనామాలతో ఊపిరి పోశారు నేతలు. తమ పదవులను ఎంపీలు, ఎమ్మెల్యేలు వదులుకున్నారు. కేంద్రంపై ఒత్తిడి తేవడంలో కీలకపాత్ర వహించారు. కాసు బ్రహ్మానందరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1966 నవంబరు 17న అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. మర్నాడు కమ్యూనిస్టు, ఇతర పార్టీలకు చెందిన 66 మంది శాసనసభ్యులు రాజీనామాలు చేశారు. అంతకు కొద్దిరోజుల ముందు లోక్‌సభలో 1966 నవంబరు 3న సీపీఎం సభ్యులు, 8న సీపీఐ సభ్యులు రాజీనామాలు సమర్పించారు. ఈ సందర్భంగా విశాఖ ఉక్కు కర్మాగారం ఆవశ్యకతను పార్లమెంటులో వివరించేందుకు ప్రయత్నించినా అవకాశం ఇవ్వలేదు. వారికి మాట్లాడే అవకాశం ఇవ్వాలని నాడు ఇతర రాష్ట్రాల ఎంపీలు స్పీకర్‌ను కోరారు.

సీపీఎంకు చెందిన తెనాలి ఎంపీ కొల్లా వెంకయ్య పార్లమెంటులో మాట్లాడుతూ తాను రాజీనామా చేస్తున్నందున తనకు ఒక్కసారి మాట్లాడే అవకాశం ఇవ్వాలని స్పీకర్‌ను కోరారు. ముందుగా రాజీనామా పత్రం చూపాలని స్పీకర్‌ సూచించగా దాన్ని వెంకయ్య స్పీకర్‌కు ఇచ్చారు. ఆ రాజీనామాను ఆమోదిస్తున్నానని, రాజీనామా చేసిన తర్వాత పార్లమెంటులో మాట్లాడడానికి అర్హత లేదన్నట్లు స్పీకర్‌ వ్యవహరించారని పలువురు కమ్యూనిస్టు నాయకులు నాటి సంఘటనలను గుర్తు చేసుకున్నారు. ‘అప్పటి ప్రజా ఉద్యమాలకు కాంగ్రెస్‌ మినహా ఇతర పార్టీల నుంచి విశేష మద్దతు దక్కింది. దీంతో నాడు అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ పెద్దలు దిగిరాక తప్పలేదు. విశాఖలోనే ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు’ అని నాటి సంగతులను విశాఖవాసులు గుర్తు చేసుకుంటున్నారు.

నాడు రాజీనామాలు చేసిన ఎంపీలు

* సీపీఎం:కొల్లా వెంకయ్య (తెనాలి), మాదాల నారాయణస్వామి (ఒంగోలు), లక్ష్మీదాస్‌ (మిర్యాలగూడ)

* సీపీఐ:వీరమాచనేని విమలాదేవి (ఏలూరు), గుజ్జుల యల్లమందారెడ్డి (మార్కాపురం), ఎద్దుల ఈశ్వర్‌రెడ్డి (కడప), రావి నారాయణరెడ్డి (నల్గొండ)

ఎమ్మెల్యేలు

సీపీఎం: తరిమెల నాగిరెడ్డి (పుట్లూరు), పుచ్చలపల్లి సుందరయ్య (గన్నవరం), గుంటూరు బాపనయ్య (నిడుమోలు), తమ్మిన పోతురాజు (విజయవాడ ఉత్తరం), మండే పిచ్చయ్య (పాయకరావుపేట), ఎస్‌.ఆర్‌.దాట్ల (అత్తిలి), గంజి రామారావు (గుడివాడ), కొరటాల సత్యనారాయణ (రేపల్లె), ఈవూరు సుబ్బారావు (కూచినపూడి), కొమ్మినేని వెంకటేశ్వరరావు (బాపట్ల), నరహరిశెట్టి వెంకటస్వామి (పర్చూరు), సూదనగుంట సింగయ్య (అమ్మనబ్రోలు), తవనం చెంచయ్య (సంతనూతలపాడు), ఎ.పి.వజ్రవేలుచెట్టి (కుప్పం), సి.కె.నారాయణరెడ్డి(పీలేరు), కె.ఎల్‌.నరసింహారావు(ఇల్లెందు), పర్సా సత్యనారాయణ(పాల్వంచ), కంగల బుచ్చయ్య (బూర్గంపహాడ్‌), ఎ.వెంకటేశ్వరరావు (నర్సంపేట), కె.రాఘవులు, ఉప్పల మల్చూర్‌ (సూర్యాపేట), నంద్యాల శ్రీనివాసరెడ్డి (సీపీఎం అనుబంధ సభ్యుడు- నకిరేకల్‌)


సీపీఐ:పిల్లలమర్రి వెంకటేశ్వర్లు (నందిగామ), మేమలపల్లి శ్రీకృష్ణ (మంగళగిరి), కె.నాగయ్య (గుంటూరు-1), పి.కోటేశ్వరరావు (పెదకాకాని), జె.ఎల్‌.ఎన్‌.చౌదరి (చీరాల), పి.వి.శివయ్య (వినుకొండ), పి.రంగనాయకులు (అద్దంకి), వెల్లంకి విశ్వేశ్వరరావు (మైలవరం), మైనేని లక్ష్మణస్వామి (కంకిపాడు), వంకా సత్యనారాయణ (పెనుగొండ), ఎ.సర్వేశ్వరరావు (ఏలూరు), పి.శ్యామసుందరరావు (ఆచంట), కె.బాబూరావు (పోలవరం), పి.రామన్న (అనపర్తి), కె.గోవిందరావు (అనకాపల్లి), పి.వి.రమణ (కొండకర్ల), స్వర్ణ వేమయ్య (బుచ్చిరెడ్డిపాళెం), కె.గురుస్వామిరెడ్డి (కనిగిరి), ఆరుట్ల రామచంద్రారెడ్డి (భువనగిరి), ధర్మభిక్షం (నల్గొండ), కె.రామచంద్రారెడ్డి (రామన్నపేట), కె.పర్వతరెడ్డి (పెద్దవూర), వై.పెద్దయ్య(దేవరకొండ), విఠల్‌రెడ్డి (నర్సాపూర్‌), ఎన్‌.పి.వి.మోహనరావు (స్టేషన్‌ ఘన్‌పూర్‌), ఎన్‌.గిరిప్రసాద్‌ (ఖమ్మం), మహ్మద్‌ తహశీల్‌ (భద్రాచలం), పూల సుబ్బయ్య (యర్రగొండపాలెం), ఆరుట్ల కమలాదేవి (ఆలేరు), కె.ఆనందాదేవి (మెదక్‌)

ఇతర పార్టీల వారు...

*మధ్యేవాద కమ్యూనిస్టు పార్టీ ఎమ్మెల్యే: డి.సీతారామయ్య (మదనపల్లె)
*స్వతంత్ర పార్టీ ఎమ్మెల్యేలు: గౌతు లచ్చన్న (సోంపేట), పి.రాజగోపాల్‌నాయుడు (తవణంపల్లె), వై.సి.వీరభద్రగౌడ్‌ (ఎమ్మిగనూరు), ఎస్‌.అప్పలనాయుడు (గొలుగొండ), పి.నారాయణరెడ్డి (మైదుకూరు), ఎన్‌.పెంచలయ్య(కోడూరు), ముత్యాల వలసపాత్రుడు, సి.డి.నాయుడు (చిత్తూరు).
*నేషనల్‌ డెమోక్రాట్స్‌ పార్టీ ఎమ్మెల్యేలు: తెన్నేటి విశ్వనాథం (మాడుగుల), ముద్రగడ వీరరాఘవరావు (ప్రత్తిపాడు)
*ఎస్‌.ఎస్‌.పి. ఎమ్మెల్యే: టి.కె.ఆర్‌.శర్మ (కర్నూలు)
*స్వతంత్ర అభ్యర్థులు: డాక్టర్‌ బి.వి.ఎల్‌.నారాయణ (ఒంగోలు), వావిలాల గోపాలకృష్ణయ్య (సత్తెనపల్లి)

ఇదీ చదవండి:

రాకాసి అలలతో మెరీనా బీచ్‌లో విద్యార్థి మృతి... మరో ఇద్దరి గల్లంతు

ABOUT THE AUTHOR

...view details