దిల్లీలో రెండోరోజూ విశాఖ ఉక్కు కార్మికుల నిరసనలు.. మద్దతు తెలిపిన పార్టీల నేతలు విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణను నిలిపివేయాలని స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు దిల్లీలో ధర్నా చేపట్టారు. నిన్నటి నుంచి దిల్లీలో నిరసనలు తెలుపుతున్నారు. ఈ రోజు కూడా ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. దిల్లీలోని ఏపీ భవన్‌లో నిరసన తెలిపారు. విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విశాఖ ఉక్కును కాపాడాలంటూ ఆందోళన చేశారు. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని.. విశాఖ ఉక్కును కాపాడాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు.
ఉద్యోగులు తలపెట్టిన ఆందోళనకు వివిధ పార్టీ నేతలు మద్దతు తెలిపారు. ఆందోళన చేపట్టిన విశాఖ ఉక్కు ఉద్యోగులకు తెదేపా ఎంపీలు కేశినేని నాని, కింజరాపు రామ్మోహన్‌నాయుడు మద్దతు పలికారు. ఏపీ భవన్ వద్దకు చేరుకుని వారికి సంఘీభావం తెలిపారు.
- ప్రైవేటీకరణకు తెదేపా వ్యతిరేకం: కేశినేని నాని
ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయం చాలా బాధాకరమని కేశినేని నాని అన్నారు. ఈ నిర్ణయంతో దాదాపు 32వేల మంది ఉద్యోగులు, వారి కుటుంబాలు ఇబ్బందులు పడతాయని చెప్పారు. కార్మికులు, ప్రజల సంపద విశాఖ ఉక్కు అని.. దాన్ని ప్రైవేటీకరణ చేస్తామంటే ఊరుకునేది లేదన్నారు. విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు తెదేపా పూర్తి వ్యతిరేకమని చెప్పారు. పార్లమెంట్‌లో దీనిపై పోరాటాన్ని కొనసాగిస్తామని.. ఈ విషయంలో అన్ని పార్టీలతో కలిసి తెదేపా ముందుకెళ్తుందని నాని చెప్పారు.
దిల్లీ జంతర్‌మంతర్‌లో విశాఖ స్టీల్‌ప్లాంట్ పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో సోమవారం ధర్నా చేపట్టారు. పోలీసులు అడుగడుగునా నిర్బంధించినా, మరోపక్క జోరువాన కురుస్తున్నా కర్మాగారం ఉద్యోగులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి పాల్గొన్నారు. కార్మికుల పోరుకు సీపీఎం, సీపీఐ, ఎల్జేడీ, వైకాపా, తెదేపా ఎంపీలు, కాంగ్రెస్, వామపక్ష అనుబంధ సీఐటీయూ, ఏఐటీయూసీ, ఐఎఫ్‌టీయూ, ఏఐకేఎస్, ఐద్వా, ఏఐఏడబ్ల్యూయూ నాయకులు మద్దతు తెలిపారు.
ఇదీ చదవండి: Corona Cases: దేశంలో కొత్తగా 30వేలకుపైగా కరోనా కేసులు