విశాఖపట్నం బీచ్ రోడ్డులోని రాజీవ్ స్మృతి భవన్ త్వరలో సీ హారియర్ యుద్ధ విమాన ప్రదర్శనశాలగా మారనుంది. సమీకృత సందర్శనాలయం, పర్యాటక సముదాయం(ఐఎంటీసీ) ప్రాజెక్టులో భాగంగా పనులు వేగవంతానికి విశాఖ మహాప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్‌డీఏ) అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. టీయూ 142, కురుసురా జలంతర్గామి, తాజాగా సీ హారియర్‌తో కలిపి ఒక సమీకృత సందర్శనాలయంగా తీసుకువచ్చేందుకు ఈ ప్రాజెక్టు చేపడుతున్నారు. ఇప్పటికే ఈ యుద్ధ విమానం బీచ్‌లో కొలువుదీరింది. గత ఏడాది గోవా నౌకాదళ కేంద్రం ఐఎన్‌ఎస్ హన్సా నుంచి విశాఖకు తీసుకువచ్చారు. అనంతరం టీయూ 142 పక్కన ఏర్పాటు చేసేందుకు వీలుగా ఒక వేదిక నిర్మించి కొన్ని మరమ్మతులు, రంగులు వేసి కొత్తగా తయారు చేశారు. ప్రస్తుతం పర్యాటకులకు రోడ్డు పక్కనే కనువిందు చేస్తోంది. దీన్ని డిసెంబరు నాటికి సిద్ధం చేయాలనుకుంటున్నారు. ఈ సమీకృత ప్రాజెక్టుకు రూ.40 కోట్లు ఖర్చు చేయనున్నారు.
సీ హారియర్ సందర్శనాలయానికి రాజీవ్ స్మృతి భవన్ వినియోగించనున్న నేపథ్యంలో ప్రస్తుతం జీవీఎంసీ ఆధ్వర్యంలో ఉన్న ఆ కేంద్రాన్ని త్వరలో వీఎంఆర్‌డీఏ స్వాధీనం చేసుకోనుంది. ఇప్పటికే ఆ భవనాన్ని తమకు అప్పగించాలని జీవీఎంసీ కమిషనర్‌కు వీఎంఆర్‌డీఏ కమిషనర్ లేఖ రాశారు. దీనికి సంబంధించిన అనుమతులు వచ్చిన వెంటనే పనుల ప్రారంభానికి టెండర్లకు వెళ్లనున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రక్రియ ఓ కొలిక్కి రావడంతో ఈ నెలలోనే టెండర్ల ప్రక్రియ పూర్తయ్యేలా ప్రణాళిక చేస్తున్నారు.