విశాఖ ఎల్‌జీ పాలిమర్స్ పరిశ్రమ సమీప గ్రామాల్లో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. రసాయన వాయువు ప్రభావం ఇంకా పోలేదు. ఇంట్లో ఉన్న సరకులు పనికి రాని కారణంగా వాటిని బయటపడేశారు. ప్రభుత్వం ఎప్పుడు ఆదుకుంటుందో తెలియదు. ఈ పరిస్థితుల్లో గ్రామస్తులు తామే స్వయంగా కావలిసిన వస్తువులు కొనుక్కుంటున్నారు.
ఒక పక్క లాక్ డౌన్ తో జీవనాధారం పోయిన బడుగు జీవులు, మరోపక్క గ్యాస్ లీకేజ్ ఘటన వల్ల అనేక ఇబ్బందులు పడుతున్నారు. అప్పు చేసి నిత్యావసర వస్తువులు కొనుగోలు చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి ఎప్పుడు సహాయం అందుతుందో తెలియని అభద్రత భావం స్పష్టంగా కనిపిస్తోంది. ఉన్న సరుకులు వాడకుండా పడేయమని చెప్పిన ప్రభుత్వ అధికారులు..తమకు ఎటువంటి సహాయం అందించలేదని ఆవేదన చెందుతున్నారు.