ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కొంప ముంచిన ఉష్ణోగ్రత - tragedy of lg polymers

ఎల్‌.జి. పాలిమర్స్‌లో ప్రమాదానికి ప్రధాన కారణం స్టైరీన్‌ రసాయనం నిర్ణీత 20 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద లేకపోవడమేనని ఆ ఘటనపై దర్యాప్తు చేస్తున్న పలువురు అధికారులు అభిప్రాయపడుతున్నారు.

కొంప ముంచిన ఉష్ణోగ్రత
కొంప ముంచిన ఉష్ణోగ్రత

By

Published : May 8, 2020, 8:56 AM IST

Updated : May 8, 2020, 9:58 AM IST

ఈ సంస్థ థర్మోకోల్‌ గ్రాన్యూల్స్‌ను తయారు చేస్తోంది. వివిధ రూపాల్లో థర్మోకోల్‌ తయారు చేయడానికి ఆయా గ్రాన్యూల్స్‌ అత్యంత కీలకం. వీటికి విపరీతమైన గిరాకీ ఉంది. ప్రధాన ముడిసరకు స్టైరీన్‌ రసాయనమే. ఇది ప్రమాదకరమైనదేమీ కాదు. అది ప్రమాదరహితంగా ఉండాలంటే సుమారు 20 డిగ్రీలలోపు ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేయాలి. ఆ స్థాయిలో ఉష్ణోగ్రత ఉందా? లేదా? అన్నది ఉద్యోగులు ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తుండాలి. నిర్ణీతస్థాయికి మించి పెరిగితే విషపూరితమైన ఆవిరిని విడుదల చేస్తుంది. ఇది గాఢమైన ‘పంజంట్‌’ వాసనతో మనుషులు పీల్చలేని విధంగా ఉంటుంది. ఈ కారణంగా కళ్లమంటలు, శరీరంపై దద్దుర్లు వస్తాయి. మనుషులు, జంతువుల నాడీ వ్యవస్థ దెబ్బతింటుంది. గురువారం తెల్లవారుజామున అదే జరిగింది. రసాయనం నుంచి ఆవిరి విడుదలవటంతో వాల్వులు బద్దలయ్యాయి. అప్పటికే ట్యాంకులో భారీఎత్తున పేరుకుపోయిన గాఢమైన ఆవిరి మొత్తం ఒక్కసారిగా బయటకొచ్చేసింది. అది గాలికన్నా ఎక్కువ బరువుగా ఉంది. గురువారం తెల్లవారుజామున సంస్థ ప్రాంగణం సమీపంలో గాలిలో కలిసిపోయి దట్టంగా అలముకుంది. ఆ ఆవిరి గాఢత తీవ్రంగా ఉండడంతో స్థానికులు ఉక్కిరిబిక్కిరైపోయారు.

పెనుప్రమాదం తప్పినట్లే...


* భద్రత వాల్వులు బద్దలవకపోతే మరింత పెనుప్రమాదం జరిగేదని నిపుణులు చెబుతున్నారు. ట్యాంకులు పేలిపోతే ఆవిరి మరింత తీవ్రంగా వేగంగా వచ్చి ఎక్కువ దూరం వ్యాపించి ఉండేదని చెబుతున్నారు.

15 కి.మీ.ల దాకా వాసన


* ప్రమాదం జరిగిన గోపాలపట్నం సమీపంలోని వెంకటాపురం నుంచి హనుమంతవాక వరకు వాసన వచ్చింది. సంస్థ చుట్టుపక్కల 15 కిలోమీటర్ల పరిధిలో ప్రభావం చూపించింది. దాదాపు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న విజయనగరం జిల్లా కొత్తవలస వరకూ వాసన వ్యాప్తి చెందింది. సంస్థ చుట్టుపక్కల సుమారు మూడు కిలోమీటర్ల పరిధిలో గాఢత ఎక్కువ ఉంది. దీంతో అధికారులు ఆయా ప్రాంతాలను ఖాళీ చేయించారు.
* ఆవిరి తాకిడికి నేరుగా గురైనవారు తీవ్రంగా ప్రభావితమయ్యారు. వాస్తవానికి ప్రమాదం జరిగిన సమయంలో సంస్థలో 15 మంది వరకు ఉన్నట్లు అధికారుల దృష్టికి వచ్చింది. వారందరూ క్షేమంగా ఉండడానికి కారణం ఆవిరి బయటకు భారీఎత్తున వెళ్లినప్పటికీ సంస్థలోపలి భాగంలో తీవ్రత తక్కువగా ఉండడమే. అయినా కొందరు స్పృహ తప్పి పడిపోయారు.

ఆవిరిగా మారడం ఆగలేదు....


* ప్రమాదానికి ప్రధాన కారణమైన ట్యాంకులో ఉన్న స్టైరీన్‌ ఆవిరిగా మారి ఇంకా వస్తోంది. గురువారం రాత్రి వరకు పూర్తిస్థాయిలో అడ్డుకట్ట పడలేదు. దీంతో గుజరాత్‌ నుంచి ఒక ‘యాంటీడోట్‌’ను తీసుకొస్తున్నారు.
* ప్రమాదం జరిగిన సమయంలో సుమారు 1800 టన్నుల వరకు స్టైరీన్‌ ఉన్నట్లు అధికారులు తేల్చారు. కొంత ఆవిరైపోగా ట్యాంకులో ఇంకా ఉందని పేర్కొన్నారు. మరో ట్యాంకులోనూ కొంత స్టైరిన్‌ ఉన్నట్లు జిల్లా కలెక్టర్‌ తెలిపారు.

ఉష్ణోగ్రతల్లో తేడాల వల్లే సమస్య..

ట్యాంకులో నిర్ణీత ఉష్ణోగ్రత లేకపోవడం వల్లే ప్రమాదం సంభవించింది. ట్యాంకు కింది భాగంలో నిర్ణీత ఉష్ణోగ్రత ఉంది. పైభాగంలో అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ తేడాలే ప్రమాదానికి దారితీశాయి -
కె.బి.ఎస్‌.ప్రసాద్‌, డి.సి.సి.ఎఫ్‌., కర్మాగారాలశాఖ

ఊహించని ఘటన..

లాక్‌డౌన్‌ కారణంగా 40 రోజులకుపైగా స్టైరిన్‌ ట్యాంకులో నిల్వ ఉండిపోయింది. ఇన్ని రోజులు నిల్వ ఉన్న పరిస్థితులు గతంలో ఎన్నడూ లేవు. ఎక్కువ రోజులు నిల్వ ఉండడం వల్ల వేడి అధికమై ట్యాంకుపై భాగంలో తీవ్రమైన ఒత్తిడి తలెత్తింది. అది ప్రమాదానికి కారణమైంది - మోహనరావు, విశాఖ ఇన్‌ఛార్జి, ఎల్జీ పాలిమర్స్‌

Last Updated : May 8, 2020, 9:58 AM IST

ABOUT THE AUTHOR

...view details