గత ఏడాది జిల్లాల పునర్విభజన నిమిత్తం ప్రభుత్వ శాఖల వారీగా ఆస్తుల వివరాలను సేకరించి పంపారు. అవన్నీ రాష్ట్ర భూ పరిపాలన వ్యవహారాల కమిషనర్ (సీసీఎల్‌ఏ) వద్ద ఉన్నాయి. అక్కడ నుంచి నిర్దేశించిన ప్రభుత్వ ఆస్తుల జాబితా కలెక్టరేట్‌కు చేరింది. కలెక్టర్ ఆదేశాల మేరకు ఆర్డీవో ఆధ్వర్యంలో నాలుగు మండలాల తహసీల్దార్లు రంగంలోకి దిగారు. మహారాణిపేట, సీతమ్మధార, గోపాలపట్నం, చినగదిలి తహసీల్దార్ కార్యాలయాల అధికారులు రెండు రోజులుగా తమ పరిధిలోని ప్రభుత్వ కార్యాలయాల ఆస్తుల వివరాలను ఆరా తీస్తున్నారు. ఆయా భూముల సర్వే సంఖ్యలు, విస్తీర్ణం, మార్కెట్ విలువ, స్కెచ్‌లు, అందుబాటులో ఉన్న ఇతర దస్త్రాలను సిద్ధం చేస్తున్నారు. వారం రోజుల్లో పూర్తి నివేదికను సీసీఎల్‌ఏకు పంపుతామని రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి. హామీగా ఇవ్వనున్న ఆస్తుల్లో గవర్నర్ బంగ్లా, కలెక్టరేట్ భవన సముదాయంతో పాటు రెండు తహసీల్దార్ కార్యాలయాల భవనాలు కూడా ఉండటం గమనార్హం.
భవిష్యత్తులో ఏమవుతుందో?
ఇప్పటికే విశాఖలో విలువైన భూములను ‘బిల్డ్ ఏపీ ప్రాజెక్టు’ కింద ప్రభుత్వం బహిరంగ వేలం పద్ధతిలో ప్రభుత్వం అమ్మకానికి పెట్టింది. దీనిపై రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమయ్యాయి. కొంతమంది హైకోర్టుకు వెళ్లడంతో భూముల అమ్మకాలపై స్టే ఇచ్చారు. ఈ క్రమంలో ప్రభుత్వ ఆస్తులను రుణాల కోసం హామీ పెడుతున్నారన్న అంశం నగరంలో చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు హామీ అంటారని, భవిష్యత్తులో ఏం జరుగుతుందోననే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అధికార వర్గాలు మాత్రం ప్రభుత్వ ఆస్తులను హామీగా పెట్టి రుణం తీసుకోవడం కొత్తేమీ కాదని, దీనివల్ల రుణాలిచ్చే సంస్థలకు వాటిపై ఎలాంటి అధికారాలూ ఉండవని చెబుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న ప్రక్రియలో భాగంగానే విశాఖలో ఉన్న ఆస్తుల వివరాలనూ అందజేయాలని ఆదేశాలు వచ్చినట్లు పేర్కొన్నాయి.
బదలాయింపు ఇలా
ప్రభుత్వ శాఖల భూములను ఏపీఎస్‌డీసీకి బదలాయించాలంటే.. తొలుత కలెక్టరేట్ నుంచి సీసీఎల్‌ఏ కార్యాలయానికి ప్రతిపాదనలు వెళ్తాయి. అక్కడ పరిశీలన తర్వాత మంత్రివర్గ సమావేశంలో ఈ ప్రతిపాదనలపై చర్చించి తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. బదలాయింపు ప్రతిపాదనలు ప్రస్తుతం సిద్ధమవుతున్నాయి. ఇదంతా గుట్టుగా చేయాలని రెవెన్యూ యంత్రాంగం భావించినా బహిర్గతమవడంతో ప్రభుత్వ వర్గాలు ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు సమాచారం.