ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

సాగర నగరాన్ని కలవరపెడుతున్న పారిశ్రామిక ప్రమాదాలు - విశాఖ పారిశ్రామిక ప్రమాదాలు న్యూస్

విశాఖ అంటే సుందర నగరం. ఓ వైపు అభివృద్ధికి... మరో వైపు పారిశ్రామికీకరణకి... ఇంకోవైపు ప్రకృతి అందాలతో మైమరపించే రమణీయతకు నిదర్శనం ఈ నగరం. అందుకే.. ఒక్కో సందర్భం విశాఖను ఒక్కో పేరుతో పరిచయం చేస్తుంది. అయితే ఈ పారిశ్రామిక నగరి ఇప్పుడు ప్రమాదాల ధాటికి చిగురుటాకులా వణుకుతోంది.

సాగర నగరాన్ని కలవరపెడుతున్న పారిశ్రామిక ప్రమాదాలు
సాగర నగరాన్ని కలవరపెడుతున్న పారిశ్రామిక ప్రమాదాలు

By

Published : Jul 14, 2020, 8:39 PM IST

Updated : Jul 15, 2020, 2:32 PM IST

సాగర నగరాన్ని కలవరపెడుతున్న పారిశ్రామిక ప్రమాదాలు

ఎల్జీ పాలిమర్స్ ఘటనను పీడకలలా భావించి మరిచిపోదాం అనుకుంటున్న తరుణంలో మొన్నటికిమొన్న సైనార్ ఫార్మా పరిశ్రమలో బెంజీన్ లీకవడంతో ప్రజలు ఉలిక్కిపడ్డారు. అంతలోనే మరో ప్రమాదం. బాంబుల తరహా శబ్దాలతో చీకటితో నల్లని ఆకాశాన్ని కమ్మేసిన వెలుతురు, పొగ కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రజలకు సైతం కంటిమీద కునుకు లేకుండా చేసింది. ఇలా వరస ప్రమాదాలు విశాఖ పారిశ్రామిక ప్రగతిపై నీలినీడలు కమ్మేసే ప్రమాదంగా ముంచుకొస్తుంటే.. మరోవైపు అసలు పరిశ్రమల్లో పని చేసే ఉద్యోగుల ప్రాణాలకు రక్షణ ఉందా.. సమీప ప్రాంతాల్లో నివసించే ప్రజలకు భద్రత ఉంటుందా అనే ప్రశ్నలను రేకెత్తిస్తున్నాయి.

రెండు నెలల క్రితమే ఎల్జీ పాలిమర్స్ నిర్లక్ష్యానికి భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చింది. ఆ తీవ్ర ప్రమాదం తరువాత పారిశ్రామిక నగరిగా ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్న విశాఖపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. నగరంలోను, పరిసర ప్రాంతాల్లోను ఉండే పరిశ్రమలపై ఆరా తీసింది. ప్రమాదం జరగడానికి ఆస్కారం ఉన్న 20పరిశ్రమలను గుర్తించింది. అంతేకాదు అన్నింటినీ అధికారులు తనిఖీచేసి భద్రతా ప్రమాణాలు ఎలా పాటిస్తున్నారు? సదరు పరిశ్రమలు సురక్షితంగా ఉన్నాయా? అక్కడి ఉద్యోగుల నైపుణ్యాలు పరిస్థితి ఏమిటి? నివారణ చర్యలు చేపట్టే సామర్థ్యం ఏమిటి? ఇలా అనేక కోణాల్లో పరిశీలన చేసి... పటిష్టంగా చర్యలు చేపట్టామని చెప్పుకున్నారు. కానీ.. వణుకు పుట్టించే స్థాయిలో వరుస ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి.

ఫార్మా సిటీలో 2వారాల వ్యవధిలో రెండు పెద్ద ప్రమాదాలు జరిగాయి. సైనార్ పరిశ్రమలో బెంజీన్ గ్యాస్ లీకైన ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా.. నలుగురు అస్వస్థతకు గురయ్యారు. ఈ ప్రమాద ఘటన జరిగిన వెంటనే భద్రతా ప్రమాణాలపై మరింత పటిష్టమైన నిఘా పెడతామని అధికారులు తెలిపారు. సురక్షిత వాతావరణంలో ఉద్యోగులు పని చేసేందుకు తీసుకోవాల్సిన చర్యల ఉల్లంఘనలను ఎట్టి పరిస్థితిల్లో సహించేది లేదన్నారు. కానీ, ప్రస్తుత ఘటన చూస్తే అన్ని వైపులా కమ్ముకున్న నిర్లక్ష్యపు నీడలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

మొత్తం 2వేల 400 ఎకరాల విస్తీర్ణంలో ఉండే ఫార్మా సిటీలో 85 కంపెనీలు ఉన్నాయి. అక్కడ 14ఏళ్ల వ్యవధిలో 59 ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఇందులో సగం పైగాప్రమాదాల్లో ప్రాణనష్టం సంభవించింది. రోజూ ఫార్మా సిటీలో పనిచేసే వారిసంఖ్య 30 వేలకుపైనే ఉంటుంది. అన్నివేల మంది ఉద్యోగులు పని చేసే సెజ్‌లో నిర్లక్ష్యం, నిర్లిప్తత మరిన్ని ప్రమాదాలకు ఆస్కారం కల్పిస్తాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ పరిశ్రమల్లో రియాక్టర్లు ఎంతో కీలకంగా ఉంటాయి. అందుకే ప్రాసెసింగ్ పరిశ్రమల్లో జరిగే రసాయన చర్యలపై పటిష్టమైన పర్యవేక్షణ ఉండాలి. కానీ, ఆ దిశగా యాజమాన్యాలు దృష్టి పెట్టడం లేదని... కంటితుడుపు చర్యగానే చర్యలు ఉంటున్నాయని తెలుస్తోంది.

నిర్వహణ వ్యయం తగ్గించుకోవడం... ఉద్యోగులు, కార్మికుల్లో నైపుణ్యాన్ని మెరుగుపరిచే దిశగా చర్యలు తీసుకోవడం వంటివి కనిపించడం లేదని చాలామంది ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. అనుకోని రియాక్షన్లు, ఒత్తిడి పెరగడం వంటి విషయాలు వెంటనే గుర్తించే వ్యవస్థలు ఏర్పాటు చేసుకోవడం... వాటిని వెంటనే అదుపులోకి తెచ్చేదిశగా అప్రమత్తత కొరవడడం వంటివి... ప్రమాదాలు తీవ్రమైన ప్రాణ నష్టాన్ని కలిగించే స్థాయికి తీసుకెళ్తున్నాయి. చిన్నపాటి నిర్లక్ష్యం సైతం... పెను ప్రమాదాలకు కారణం అవుతున్నా వాటిని సరి చేసుకుని సురక్షిత వాతావరణాన్ని మాత్రం ఏర్పరచ లేకపోతున్నారు.

ఇప్పుడు చూస్తే... ఫార్మా సిటీ నిర్వహణ, ప్రమాణాల బాధ్యతను చూసే రాంకీ సంస్థకు చెందిన ప్రాంగణంలోనే విశాఖ సాల్వెంట్స్ ప్రమాదం చోటు చేసుకుంది. ఆదర్శంగా ఉండాల్సిన, ఉంటుందనుకునే పరిశ్రమలోనే ఈ స్థాయిలోప్రమాణాలను గాలికి వదిలేసే వాతావరణం ఉందంటే ఇతర పరిశ్రమల్లో పరిస్థితి ఏ మేర నియంత్రణలోఉంటుందనే విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. ఈ తరహా ప్రమాదాలు చోటు చేసుకున్నప్పుడల్లా పరిసర ప్రాంతాల్లో నివసించే ప్రజలు ప్రాణాలు అరచేత పట్టుకుని ఉండాల్సి వస్తోంది.

ఈ తరహా ప్రమాదాలు జరిగిన తరువాత వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన అధికారులు అప్రమత్తమై నిర్వహించే తనిఖీలు ప్రయోజనకరంగా ఉండాలనే అభిప్రాయాలు ఉన్నాయి. ముఖ్యంగా ఏ విషయాల్లో లోపం ఉంది.. ఎక్కడ డొల్లతనం గమనించారు వాటికి పరిష్కార మార్గాలు ఏమిటి అనే విషయాలపైనా అధ్యయన కమిటీలు సలహాలు సూచనలు ఇవ్వల్సిన అవసరాన్నినిపుణులు గుర్తుచేస్తున్నారు. ఈ విషయంలో మొక్కుబడి ధోరణి సరైనది కాదని చెబుతున్నారు. గుర్తించిన లోపాలపై దిద్దుబాటు చర్యలు పటిష్టంగా ఉన్నాయా? లేక పైపై మెరుగులకే పరిమితం అయ్యారా అనే విషయాన్ని సైతం గమనించాల్సిన అవసరం ప్రభుత్వంపై ఉందని చెబుతున్నారు.

ఉపాధి కల్పించే పరిశ్రమలు భద్రతాప్రమాణాలు సమర్థంగా పాటించాల్సిన అవసరం ఉంది. 8 గంటల ఉద్యోగం కోసం పరిశ్రమ గేటు లోపలికి వచ్చే కార్మికులను బలిపీఠాలు ఎక్కించకుండా జాగ్రత్తలు పాటించాలి. వేల మంది నిత్యం ప్రమాదపుటంచున పని చేస్తున్నారనే విషయం కళ్ల ముందు స్పష్టంగా కనిపిస్తున్న తరుణంలో ప్రభుత్వం పరిశ్రమలను సురక్షితంగా మలిచే దిశగా మరింత దృష్టి సారించాలి. ప్రమాదం జరగదుఅనే నిర్లక్ష్య ధోరణిని విడిచి పెట్టి... ఎట్టి పరిస్థితిలోను ప్రమాదం జరగకుండా ఉండేందుకు అవసరమైన జాగ్రత్తలను ప్రతి పరిశ్రమపాటించే విధంగా కచ్చితమైన నిబంధనలను అమలు చేయాలి. ప్రశాంతనగరంగా ఉండే విశాఖలో వరస ప్రమాదాలు ప్రజల్లో తీవ్ర ఆందోళనకు కారణం అవుతున్నాయనే విషయాన్ని గుర్తించాలి. పారిశ్రామికనగరిగా మరింత వృద్ధిలోకి వచ్చే దిశగా జరుగుతున్న ప్రయత్నాలకు ధీటుగా భద్రతా వైఫల్యాలను ఎట్టి పరిస్థితుల్లోను ఉపేక్షించేది లేదనే వైఖరిని ప్రభుత్వం తీసుకురావాల్సిన అవసరం ఎంతో ఉంది.

ఇదీ చదవండి:పోలీసునూ వదలని కోవిడ్... వైరస్ సోకి సీఐ మృతి

Last Updated : Jul 15, 2020, 2:32 PM IST

ABOUT THE AUTHOR

...view details