ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jul 26, 2020, 8:13 PM IST

Updated : Jul 27, 2020, 6:37 AM IST

ETV Bharat / city

విశాఖ సృష్టి ఆసుపత్రిపై చైల్డ్ ట్రాఫికింగ్ కేసు: ఆర్కే మీనా

పిల్లల్ని విక్రయిస్తున్న ఓ ముఠాను విశాఖ పోలీసులు అరెస్టు చేశారు. విశాఖలోని ‘సృష్టి’ ఆసుపత్రి కేంద్రంగా ఈ అక్రమం సాగుతున్నట్లు గుర్తించారు. ఆసుపత్రి ఎండీ సహా ఆరుగురిని అరెస్టు చేశారు. విశాఖ నగర కమిషనర్‌ సీపీ మీనా, డీసీపీ-1 ఐశ్వర్య రస్తోగి ఆదివారం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు.

vishaka cp rk meena about child trafficking in srusti hospital
vishaka cp rk meena about child trafficking in srusti hospital

విశాఖ సృష్టి ఆస్పత్రి నుంచి పసిపిల్లల అక్రమ రవాణా జరుగుతోందని సీపీ ఆర్కే మీనా తెలిపారు. ఆస్పత్రిపై చైల్డ్ ట్రాఫికింగ్ కేసు నమోదు చేశామని వెల్లడించారు.

డాక్టర్‌ నమ్రత 2010 నుంచి సృష్టి టెస్టుట్యూబ్‌ బేబీ సెంటర్‌ పేరిట ఆసుపత్రిని నిర్వహిస్తున్నారు. ఆసుపత్రిపై గతంలో రెండు క్రిమినల్‌ కేసులు నమోదయ్యాయి. వీరికి విశాఖతో పాటు రాష్ట్రంలోని మరికొన్ని నగరాలు, కోల్‌కతాలోనూ శాఖలు ఉన్నాయి. ఆసుపత్రిలోని కొందరు ఏజెంట్లు, కొంతమంది ఆశా వర్కర్లు ముఠాగా ఏర్పడ్డారు. నిరాశ్రయులు, నిరుపేదలైన గర్భిణులు, అవాంఛిత గర్భం దాల్చిన వారిని ఉచిత వైద్యశిబిరాల్లో గుర్తిస్తారు. వారిని సృష్టి ఆసుపత్రిలో చేర్పించి, కాన్పు చేయిస్తారు. తర్వాత కొంత డబ్బు ముట్టజెప్పి పిల్లల్ని తీసుకుని ధనిక కుటుంబాలను విక్రయిస్తున్నారు.

విశాఖ సృష్టి ఆసుపత్రిపై చైల్డ్ ట్రాఫికింగ్ కేసు

గత నెల 24న సుందరమ్మ అనే మహిళ తన బిడ్డ కనిపించడం లేదంటూ ఫిర్యాదు చేసిందని సీపీ ఆర్కే మీనా తెలిపారు. ఆమె ప్రసవించాక బిడ్డను కోల్‌కతాలో ఉన్నవారికి అమ్మేశారని.. సృష్టి ఆస్పత్రి కేంద్రంగా ఈ వ్యవహారం జరిగిందని వెల్లడించారు. ఈ కేసులో 8 మందిని నిందితులుగా చేర్చినట్లు ఆర్కే మీనా వివరించారు.

సృష్టి ఆస్పత్రి ఎండీ నమ్రత ప్రధాన నిందితురాలు. పసిపిల్లల అక్రమ రవాణాలో ఇద్దరు ఆశా వర్కర్ల ప్రమేయం ఉంది. ఇప్పటివరకు ఆరుగురు నిందితులను అరెస్టు చేశాం. పేదలను లక్ష్యంగా చేసుకుని పిల్లల అక్రమ రవాణా సాగుతోంది. ఇదే తరహాలో సృష్టి ఆస్పత్రిపై మరో కేసు నమోదైంది.-ఆర్కే మీనా, విశాఖ సీపీ

డొంక కదిలిందిలా...


విశాఖ జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన వితంతువు గర్భం దాల్చింది. ఆమెను ఆశా కార్యకర్తలు కె.వెంకటలక్ష్మి, అన్నపూర్ణ గుర్తించారు. సృష్టి ఆసుపత్రి ఏజెంట్‌ రామకృష్ణ సాయంతో వితంతువును ఆసుపత్రిలో చేర్పించారు. బిడ్డను ప్రసవించాక ఆమెకు కొంత నగదు ఇచ్చి పంపించారు. చిన్నారిని కోల్‌కతాకు చెందిన దంపతులకు విక్రయించారు. శిశువు లేకుండా వచ్చిన వితంతువును అదే గ్రామానికి చెందిన అంగన్‌వాడీ కార్యకర్త గుర్తించి ప్రశ్నించారు. ఆమె నుంచి సరైన సమాధానం రాకపోవడంతో విషయాన్ని చైల్డ్‌లైన్‌కు చేరవేశారు. చైౖల్డ్‌లైన్‌ ప్రతినిధుల విచారణలో బిడ్డ విక్రయం బయటపడింది. దీనిపై వారు సీడబ్ల్యూసీకి (చైల్డ్‌ వెల్ఫేర్‌ కమిటీ)కి సమాచారం అందించారు. బిడ్డను తిరిగి తల్లికి అప్పగించాలని సృష్టి ఆసుపత్రిని సీడబ్ల్యూసీ ఆదేశించింది. ఆసుపత్రిలో పని చేసే చంద్రమోహన్‌ కోల్‌కతా నుంచి బిడ్డను తీసుకువచ్చి అప్పగించాడు. మరో మహిళ ఇదే ఆసుపత్రి ద్వారా బిడ్డను విక్రయించింది. ఆ తర్వాత బిడ్డ తనకు కావాలని సీడబ్ల్యూసీని ఆశ్రయించటంతో ఆసుపత్రి వర్గాలు చిన్నారిని అప్పగించాయి. ఒకే ఆసుపత్రిలో రెండు కేసులు రావటంతో అనుమానం కలిగిన సీడబ్ల్యూసీ... విషయాన్ని నగర పోలీసు కమిషనర్‌ ఆర్కే మీనా దృష్టికి తీసుకువెళ్లింది. రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేయడంతో అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. ఆసుపత్రి ఎండీ డాక్టర్‌ నమ్రతను ఆదివారం కర్ణాటక దేవనగరిలో అరెస్టు చేశారు. ఆశా వర్కర్లు వెంకటలక్ష్మి, అన్నపూర్ణ, ఏజెంట్‌ రామకృష్ణ, చంద్రమోహన్‌, ఆసుపత్రి వైద్యుడు తిరుమలను అరెస్టు చేసి, విచారించారు. బిడ్డను తీసుకున్న కోల్‌కతా దంపతులపై కేసు నమోదు చేశారు. ఇప్పటిదాకా ఆరుగురు పిల్లల విక్రయాలు సాగినట్లు తేలింది.

ఇదీ చదవండి:ఏపీలో ఆ కుటుంబానికి ట్రాక్టర్ కొనిస్తా: సోనూసూద్

Last Updated : Jul 27, 2020, 6:37 AM IST

ABOUT THE AUTHOR

...view details