విశాఖ ఉక్కు కర్మాగారానికి సొంత గనులు లేకపోవడంతో ఏటా రూ.వేల కోట్ల అదనపు భారాన్ని మోయాల్సి వస్తోంది. కేవలం గనులు లేని కారణంగానే ఒక టన్ను ఉక్కు ఉత్పత్తికి అదనంగా రూ.4వేల నుంచి రూ.5వేల వరకు వ్యయం చేయాల్సి వస్తోంది. అయినప్పటికీ పోటీదారు సంస్థల ఉక్కు ఉత్పత్తుల ధరలకు అనుగుణంగానే విక్రయాలు జరపాల్సిన దుస్థితి. లేదంటే విశాఖ ఉక్కు విక్రయ ధర ఎక్కువన్న కారణంగా విక్రయాలు పడిపోయే ముప్పు పొంచి ఉంటుంది. దేశంలోని ప్రభుత్వరంగ ఉక్కు కర్మాగారాల్లో ఒక్క విశాఖ ఉక్కు కర్మాగారానికి మాత్రమే సొంత గనులు లేకపోవడం గమనార్హం.
- దేశంలో గనులకు ఏ మాత్రం కొదవేలేదు. సెయిల్ సంస్థకు సుమారు 200 సంవత్సరాల వరకు సరిపోయేంత ముడి ఇనుమున్న గనులున్నాయి. ఎన్.ఎం.డి.సి.(నేషనల్ మినరల్ డవలప్‌మెంట్ కార్పొరేషన్) సంస్థకు కూడా వివిధ రాష్ట్రాల్లో భారీఎత్తున ఇనుప గనులున్నాయి. ఎన్‌ఎండీసీ సంస్థ భారీ లాభాలకు ముడి ఇనుమును విక్రయిస్తుండడంతో విశాఖ ఉక్కు కర్మాగారం భారీ నష్టాలను చవిచూస్తోంది. మార్కెట్ పరిస్థితులు, కేంద్రప్రభుత్వ నిర్ణయాల కారణంగా ఒక ప్రభుత్వ రంగ సంస్థ భారీఎత్తున ఆదాయాన్ని ఆర్జిస్తుండగా మరో ప్రభుత్వరంగ సంస్థ నష్టాల ఊబిలోకి కూరుకుపోవాల్సిన దయనీయ పరిస్థితులు దాపురించాయి.
- సొంత గనులు లేని కారణంగా విశాఖ ఉక్కు కర్మాగారంపై ఏటా రూ.3వేల కోట్ల అదనపు భారం పడుతోంది. త్వరలో ఆ భారం రూ.4వేల కోట్లకు చేరే అవకాశం ఉంది. సొంత గనులుంటే ఆ అదనపు భారం మొత్తం సంస్థకు మిగిలి అదే స్థాయిలో లాభాలు నమోదయ్యేవి. సంస్థకు అవసరమైన గనులను కేటాయిస్తే వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్న ఉక్కు కర్మాగారం మరింత వేగంగా అభివృద్ధి చెందడానికి, మరిన్ని వేల మందికి ఉపాధి కల్పించడానికి అవకాశం ఉంటుంది. ఫలితంగా దశాబ్దాలుగా ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వేలాదిమంది నిర్వాసితుల కుటుంబీకులకు కూడా ఉద్యోగాలు కల్పించవచ్చు. అయినప్పటికీ ఆ దిశగా కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు ఏమాత్రం చొరవ తీసుకోవడం లేదు.
- విశాఖ ఉక్కు కర్మాగారానికి అవసరమైన ముడిసరకును తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చన్న ఉద్దేశంతో విశాఖ ఉక్కు కర్మాగారం ఒడిశాలోని ఒ.ఎం.డి.సి.(ఒడిశా మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్)లో వాటాలను రూ.360కోట్లు వెచ్చించి కొనుగోలు చేసింది. ఆ సంస్థ గనుల తవ్వకానికి సాంకేతిక సమస్యలు తలెత్తడంతో దశాబ్దం గడుస్తున్నా ఆ సంస్థ నుంచి ఒక్క టన్ను ముడిఇనుము కూడా సమకూర్చుకోలేని దుస్థితి తలెత్తింది. రాజస్థాన్‌లోని గనుల్లో పెట్టుబడి పెట్టినా ఉపయోగం లేకుండా పోయింది.
- ప్రస్తుత లోక్‌సభ సభ్యులుగా ఉన్న ఎంపీలు ఎం.వి.వి.సత్యనారాయణ, సత్యవతి ఇద్దరూ విశాఖ ఉక్కు కర్మాగారానికి గనుల కేటాయించాలని లోక్‌సభలో డిమాండ్ చేశారు. గతంలో ఎంపీలుగా విశాఖ నుంచి ఎన్నికైన వారుకూడా వారి గళం వినిపించారు. ఆయా డిమాండ్లను కూడా పట్టించుకునే నాథుడే కరవయ్యాడు.