నవంబర్ 30న విశాఖ పోర్టు చరిత్రలో తొలిసారిగా ఓ భారీ నౌక ఇన్నర్ హార్బర్లోకి ప్రవేశించింది. విశాఖ పోర్టులో ఇంతవరకు కేవలం 230 మీటర్ల పొడవు, 32.5 మీటర్ల బీం ఉన్న నౌకలను మాత్రమే హ్యాండిల్ చేసే అవకాశం ఉంది. అయితే విశాఖ పోర్టు అధికారుల బృందం 2019 సెప్టెంబర్లో సింగపూర్లో అనుకరణ అధ్యయనం చేసింది. ఈ అధ్యయనం ద్వారా భారీ నౌకలు సైతం ఇన్నర్ హార్బర్లోకి ప్రవేశించే అవకాశం కలిగింది. అనుకరణ అధ్యయనం తర్వాత మొట్టమొదటిసారి భారీ నౌకని ఇన్నర్ హార్బర్లోకి తీసుకురావడం ద్వారా పోర్టు సామర్థ్యం వాణిజ్య విపణిలో వెల్లడైంది.
ఇదే ఉత్సాహంతో ఆసియా, ఆఫ్రియా ఖండాల నుంచి అతి భారీ నౌకలను తీసుకువచ్చేందుకు విశాఖపోర్టు యత్నిస్తోంది. ఇందుకు సంబంధించిన బృందం చురుగ్గా యత్నాలు ఆరంభించింది. ఇంత అత్యధిక సామర్థ్యం ఉన్న నౌకలు ప్రపంచంలో దాదాపు వందల్లోనే ఉన్నట్టు అంచనా. ఇందులో ఐదారు శాతం నౌకలను రప్పించినా విశాఖ పోర్టు వాణిజ్యం మరింత జోరందుకునే అవకాశం ఏర్పడుతోంది.