విశాఖ సాగర తీర పర్యాటకులకు అత్యద్భుత అనుభూతిని అందించే ప్రత్యేకతల్లో టీయూ-142 యుద్ధ విమాన ప్రదర్శనశాల ఒకటి. విశాఖ వచ్చిన వారు ఆర్కే బీచ్ చూడడం ఎంత సహజమో...బీచ్ రోడ్డులో ఉన్న ఈ యుద్ధ విమాన ప్రదర్శనశాలను సందర్శించడం అంతే సహజంగా మారింది. లాక్డౌన్ పరిణామంతో మార్చి నెల నుంచి మూతపడి ఉన్న ప్రదర్శన శాల... డిసెంబర్ 3 నుంచి తెరుచుకుంది. ఇక విశాఖ పర్యటనకు వచ్చిన వారంతా యుద్ధ విమాన ప్రదర్శనశాల విశేషాలను తిలకిస్తూ ఆనందిస్తున్నారు.
టీయూ-142 ప్రాంగణంలోకి అడుగుపెట్టేవారు కచ్చితంగా కొవిడ్ నిబంధనల్ని పాటించే విధంగా చర్యలు తీసుకున్నారు. పర్యాటకులను పరిమితంగా అనుమతిస్తున్నారు. సాధారణ రోజుల్లో వెయ్యి మందికి పైగా టీయూ-142 ప్రదర్శనశాలను సందర్శించేవారు. ప్రస్తుతం ఈ సంఖ్యను నాలుగైదు వందలకు పరిమితం చేశారు.