విశాఖ ఉక్కు కర్మాగారంలో కొందరు ఉద్యోగులు వారి తండ్రి పేర్లను మార్చిన ఉదంతం చర్చనీయాంశంగా మారింది. ఒకరో.. ఇద్దరో... కాదు ఏకంగా 281 మంది వారి తండ్రి పేరును తప్పుగా ఇవ్వడం కలకలం రేపింది. ఏళ్ల నాటి నుంచి విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగుల రికార్డులను పరిశీలించి సంస్థకు వారిచ్చిన వివరాలు సరైనవా? కావా? అన్న విషయాన్ని ప్రస్తుతం వెలికి తీయడానికి కారణాలేమై ఉంటాయన్న అంశం కర్మాగారంలో చర్చనీయాంశమైంది. ఉద్యోగుల పేర్లు, వారి గుర్తింపుకార్డు నెంబర్లు, తండ్రి పేరు, పి.ఎఫ్. రికార్డుల్లో ఉన్న తండ్రి పేరు, సోదర ఉద్యోగులు ఏ విభాగంలో విధులు నిర్వర్తిస్తున్నారు? అన్న వివరాలపై అధికారులు కూపీలాగారు.
అధికారులు ఈ మేరకు ఓ జాబితా కూడా రూపొందించారు. అందులో సుమారు 281 మంది పేర్లున్నాయి. తండ్రి పేరు తప్పుగా రాయడం వెనుక ఎలాంటి కారణాలుంటాయన్న అంశాన్ని విశ్లేషిస్తున్నారు. ఈ విషయంపై రహస్యంగా విచారణ జరుపుతున్నట్లు తెలుస్తోంది. కొందరు ఇప్పటికే సరిచేసుకున్నారు....రికార్డుల్లో వివరాలు నమోదు చేసేటప్పుడు చిన్నచిన్న తప్పిదాలు జరగడం సహజమే. అలాంటి తప్పిదాలు జరిగినట్లు గుర్తిస్తే తరువాత రోజుల్లో తగిన ఆధారాలు చూపి ఆయా దోషాలను సవరించుకునే ప్రక్రియను అధికారులు నిర్వహిస్తారు. పేర్లలో అక్షరాలు తప్పుగా పడడం సహజంగా జరిగేదే గానీ.... ఏకంగా పేరే మారిపోయే ఉదంతాలు తక్కువగా చోటు చేసుకుంటాయి. కొందరు ఉద్యోగులు తమ రికార్డులో తప్పుగా నమోదైన వివరాలను సరి చేయించుకున్నారు. తండ్రి పేరును మార్చిన వారి నియామక ప్రక్రియను పరిశీలిస్తే వాస్తవాలు వెలుగుచూసే అవకాశం ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఉద్యోగులు సంవత్సరాల పాటు తప్పుడు వివరాలను సవరించుకోకుండా వదిలేయడంపై పలు అనుమానాలు తలెత్తుతున్నాయి.
ఆర్థిక లబ్ధి కోసం తప్పుడు దారులు..!