విశాఖ ఉక్కు కర్మాగారాన్ని 100 శాతం ప్రైవేటీకరిస్తామన్న కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటనతో కార్మిక సంఘాలు భగ్గుమన్నాయి. పార్లమెంటులో లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానంతో నెలకుపైగా ఉద్యమిస్తున్న వారిలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. అంతవరకూ దీక్షా శిబిరాల్లో ఉన్నవారంతా రోడ్డెక్కారు. కూర్మన్నపాలెంలో ఉక్కు పరిశ్రమ ప్రధాన ద్వారం ముందు మానవహారంతో నిరసన తెలిపారు. సాయంత్రం ఆరు నలభై దాటాక.. రోడ్డుపై బైఠాయించి వాహనాల్ని అడ్డుకున్నారు. జాతీయ రహదారిపైనే మంటపెట్టారు.
త్వరలో కార్యాచరణ..
సమయం గడిచేకొద్దీ.. కూర్మన్నపాలెం గేటు వద్ద మరికొందరు కార్మికులు పోగయ్యారు. వందలకొద్దీ వాహనాలు నిలిచిపోవడం వల్ల ట్రాఫిక్ పెద్దఎత్తున స్తంభించింది. కేంద్రం నిర్ణయాన్ని అంగీకరించబోమని కార్మికసంఘాల నేతలు తేల్చిచెప్పారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా త్వరలో కార్యాచరణ నిర్ణయిస్తామన్నారు.