చూసేందుకు అబ్బురంగా కనిపిస్తున్న ఈ చిత్రాలు.. ఎందుకూ పనికిరాని వ్యర్థాలతో రూపొందించినవి. విశాఖ జిల్లా అనకాపల్లికి చెందిన శిరీష.. వీటికి ప్రాణం పోశారు. ఉడకపెట్టాక పడేసిన కోడిగుడ్డు పెంకులు, పాత సీడీలు, కర్రపుల్లల సాయంతో వస్తువులు తయారు చేస్తున్నారు.
చిన్నతనం నుంచే చిత్రలేఖనంపై ఆసక్తి పెంచుకున్న శిరీష...సృజనాత్మకతను జోడించి అబ్బురపరిచే వస్తువులు తయారు చేస్తున్నారు. ముందుగా ఓ కాగితంపై వాటిని గీసి... రూపు తీసుకొస్తారు. తర్వాత వాటికి వ్యర్ధాలను కావాల్సిన విధంగా అంటించి... రంగులు నింపుతారు. భర్త కూడా చిత్రకారుడు కావటంతో శిరీషకు పూర్తి ప్రోత్సాహం అందించారు. కేవలం చిత్రాలు గీయడమే కాకుండా తమకంటూ ప్రత్యేక ఉండాలనే ఉద్దేశంతో వచ్చిన ప్రతి ఆలోచనతోనూ...వైవిధ్య వస్తువులు తయారు చేస్తున్నారు. ఈమె కృషిని గుర్తించిన పలు సంస్థలు... పురస్కారాలను సైతం అందించాయి.