విశాఖ కేంద్రంగా ఆంధ్రప్రదేశ్‌కి రైల్వేజోన్ ఏర్పాటు చేస్తామంటూ కేంద్రం ప్రభుత్వం ప్రకటన చేసి ఇప్పటికి 15 నెలలు అవుతోంది. అయితే ఇప్పటికీ కనీసం ప్రారంభ పనులు కార్యరూపం దాల్చలేదు. తొలి ఓఎస్డీగా శ్రీనివాస్ నియమితులైన తర్వాత ఓ కార్యాలయాన్ని సైతం ఏర్పాటు చేశారు. ఆయన్ని బదిలీ చేసి ధనుంజయులను ఓఎస్డీగా నియమించారు. ఆయన్ను కూడా రెండ్రోజుల క్రితమే దక్షిణ రైల్వేకి ఉన్నతాధికారులు బదిలీ చేశారు. ఈ పోస్టులోకి ఎవరినీ నియమించకపోవడం జోన్ ఏర్పాటు ప్రక్రియపై నీలినీడలు కమ్ముకున్నాయి.
ఆశలు నెరవేరేనా..?
విశాఖ రైల్వే జోన్ పదకొండు నెలల్లోనే అందుబాటులోకి వస్తుందన్న అప్పటి రైల్వే మంత్రి పీయూష్ గోయల్ ప్రకటన ఎప్పటికి కార్యరూపంలోకి వస్తుందన్నది ప్రశ్నార్థకంగా తయారైంది. కొత్త జోన్ ఏర్పాటైతే.. ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని ఈ ప్రాంత వాసులు భావించారు. విశాఖ కేంద్రంగా ఉన్న వాల్తేర్ డివిజన్ గడచిన ఆర్థిక సంవత్సరంలో పెద్ద ఎత్తున ఆదాయాన్ని సాధించి దేశంలోనే అత్యధిక ఆదాయమున్న డివిజన్ల తొలివరుసలో నిలిచింది. ఈ డివిజన్‌ను ముక్కలు చేసి రాయగడ డివిజన్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. అయితే ఈ డివిజన్ మనుగడ కొనసాగించాలన్న డిమాండ్ గట్టిగా కేంద్రం ముందుంది.
ఆగస్టులోనే నివేదిక