స్వచ్ఛతలో మరో ఘనత సాధించిన విశాఖ రైల్వే స్టేషన్ - good ranking for vishaka railway station
దేశంలోనే పరిశుభ్రంగా ఉన్న రైల్వేస్టేషన్లలో ఒకటిగా విశాఖ రైల్వేస్టేషన్ మరోసారి గుర్తింపు పొందింది. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి నుంచి ఉత్తమ ర్యాంకింగ్ పొంది సత్తా చాటింది.
కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి నుంచి విశాఖ రైల్వే స్టేషన్కి ఉత్తమ ధ్రువీకరణ లభించింది. తాజా తనిఖీల ద్వారా భారతీయ రైల్వేలలో మూడు స్థాయిల ధ్రువీకరణను కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి ఇచ్చింది. 91 అంశాల్లో ఈ పరిశీలన నిర్వహించింది. ఉత్తమ, మధ్యమ, అధమ (గుడ్, యావరేజి, బిలో యావరేజి) అన్న స్థాయిల్లో ఈ ధ్రువీకరణలు ఉన్నాయి. 60 మార్కుల కంటే ఎక్కువ వచ్చిన స్టేషన్లు, యూనిట్లకు గుడ్ ర్యాంకింగ్ లభించింది. జైపూర్, విశాఖపట్నం, మైసూర్, వడోదర, బిలాస్ పూర్ రైల్వేస్టేషన్లు మాత్రమే గుడ్ ర్యాంకింగ్ పొందాయి. ఘన వ్యర్థాల నిర్వహణ, పరిశుభ్రత, వ్యర్థజలాల యాజమాన్యం, ఐఎస్ఓ సర్టిఫికేషన్, ప్లాస్టిక్ వ్యర్ధాల నిర్వహణ, నిఘా కెమెరాల పర్యవేక్షణ, ప్రయాణికుల స్పందన వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంది.