ప్రేమ పేరుతో వేధింపులు... దాడులు. అవునంటే అనుమానాలు, కాదంటే ప్రతీకారాలు. కత్తి కాచుకు కూర్చుందా అన్నట్లు విద్యార్థినులపై జరుగుతున్న వరుస దాడులు. తల్లిదండ్రుల్లోనే కాదు లక్షలాది మంది విద్యార్థుల్లో ఆందోళనకు దారితీస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన గాజువాక హత్యోదంతం నుంచి ఓ మార్పు కోసం నాంది పలికారు విశాఖ పోలీసులు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా యువతను చైతన్య పరిచే ఆలోచన చేశారు. ఆ దిశగా 'నేటి యువతే రేపటి పౌరులు' అనే నినాదంతో పెద్ద ఎత్తున అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నారు.
కళాశాలలు, పాఠశాలల దత్తత కార్యక్రమం
ఈ కార్యక్రమంలో భాగంగా విశాఖ కమిషనరేట్ పోలీసు స్టేషన్ల పరిధిలోని కళాశాలలు, పాఠశాలల్లో తొలి విడతగా కొన్నింటిని దత్తత తీసుకుంటారు. ఒక పోలీసు ప్రతినిధి ఒక కళాశాల బాధ్యత తీసుకోవడం ద్వారా అక్కడ తలెత్తే ఇబ్బందులను గుర్తిస్తుంటారు. ప్రతి వారం కచ్చితంగా ఆ కళాశాలకు వెళ్లి అక్కడి సమస్యలను తెలుసుకుంటారు. తద్వారా సమస్య తీవ్రతను బట్టి వారికి అవగాహన కల్పించడం, తప్పు మార్గంలో ఆలోచన చేయకుండా ఉండడంపై వారికి కౌన్సిలింగ్ నిర్వహిస్తారు. పోలీసులు నేరుగా ఈ తరహా కార్యక్రమం చేపట్టడం ద్వారా విద్యార్థుల్లోనూ పూర్తి స్థాయి భరోసా కలిగే అవకాశం ఉంటుందని సీపీ మనీష్ కుమార్ సిన్హా భావిస్తున్నారు. మరో వైపు నేరాలు చేయాలనే ఆలోచనను ఆదిలోనే అంతం చేయడం.. ఈ ప్రయత్నం ద్వారా సాధ్యపడుతుందని పోలీసులు విశ్వసిస్తున్నారు.