భూరికార్డుల తారుమారు, ప్రభుత్వ భూముల ఆక్రమణ, కబ్జా తదితర ఆరు అంశాలపై విచారణ చేపట్టేందుకు విశ్రాంత ఐఏఎస్ అధికారి డాక్టర్ విజయకుమార్ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది నవంబరు 27న సిట్ ఏర్పాటుచేసింది. 1381 మంది సిట్‌కు ఫిర్యాదులు చేశారు. ఆయా ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలన చేసిన సిట్ పలు అక్రమాలను గుర్తించింది. ఈ ఏడాది జనవరిలో సిట్ మధ్యంతర నివేదికను సీఎంకు అందజేసింది. ఇప్పుడు పూర్తి స్థాయి నివేదికను సిద్ధం చేస్తున్నారు. డిసెంబరు మొదటి వారంలో నివేదికను అందజేయనుంది. రికార్డులను మళ్లీ ట్రెజరీకి పంపి భద్రపర్చాలని నిర్ణయించారు.
2017లో సిట్ అందజేసిన నివేదికలోని సారాంశాలను అధికారులు అధ్యయనం చేశారు. తాజాగా వచ్చిన ఫిర్యాదులు, వాటిలో పేర్కొన్న అంశాలు, రెవెన్యూ దస్త్రాల్లో పొందపర్చిన అంశాలు, నిబంధనలను పరిశీలన చేసి పూర్తిస్థాయి నివేదిక రూపొందించారు. ఆయా అక్రమాల విషయంలో బాధ్యులైన అధికారులు, సిబ్బందిని గుర్తించారు. 30కు పైగా జారీ చేసిన ఎన్‌వోసీల్లో అక్రమాలున్నట్లు తేల్చారు. బాధ్యులపై కఠిన చర్యలను తీసుకోవాలని సిఫార్సులు చేస్తున్నారు. మధురవాడ, పరవాడ, భీమునిపట్నం, విశాఖపట్నం గ్రామీణ మండలాల పరిధిలో జారీ చేసిన ఎన్‌వోసీలో అధికంగా అక్రమాలు చోటు చేసుకున్నట్లు నిర్ధరించారు.