YSRCP Visakha Garjana to support 3 capitals proposal: విశాఖ గర్జనకు సర్వం సిద్ధమైంది. పరిపాలన రాజధాని కోసం ఐకాస తలపెట్టిన ఈ కార్యక్రమానికి, అధికార వైకాపా పూర్తి మద్దతు తెలిపింది. అమరావతి రైతులు ఉత్తరాంధ్రపై దండయాత్ర చేస్తున్నారని ఆరోపిస్తున్న నేతలు.. విశాఖ గర్జన ద్వారా ఈ ప్రాంత ప్రజల మనోభావాలను గట్టిగా చాటిచెబుతామని స్పష్టంచేశారు.
అధికార వైకాపా మద్దతుతో రాజకీయేతర ఐకాస తలపెట్టిన విశాఖ గర్జనకు ఏర్పాట్లుచేశారు. ఉదయం 9 గంటలకు ఎల్ఐసీ జంక్షన్‌లోని అంబేడ్కర్ విగ్రహం వద్ద నుంచి గర్జన ర్యాలీ ప్రారంభమవుతుంది. సెవెన్ హిల్స్ జంక్షన్ మీదుగా పార్క్ హోటల్ జంక్షన్‌కు చేరుకుంటుంది. అల్లూరి సీతారామరాజు, వైఎస్‌ఆర్ విగ్రహాల వద్ద బహిరంగ వేదిక వద్దకు చేరుకున్నాక నేతలు ప్రసంగిస్తారు.