రాష్ట్రంలోని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖను ప్రభుత్వం పునర్ వ్యవస్థీకరించనుంది. ఇకపై ఈ శాఖను కేవలం మద్యం సరఫరాకే పరిమితం చేయనుంది. ఎక్సైజ్ పోలీసుస్టేషన్లు అన్నీ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో(ఎస్ఈబి) స్టేషన్లుగా మారనున్నాయి. విశాఖ గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి అనకాపల్లిలో అసిస్టెంట్ ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ స్టేషన్ ఉండగా..దీనిని రెండుగా విభజించనున్నారు. జిల్లాలో ఏజెన్సీ ప్రాంతానికి ముఖద్వారంగా ఉన్న నర్సీపట్నంలో కొత్త స్టేషన్ ఏర్పాటు చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.
అనకాపల్లి జీవీఎంసీ పరిధిలో ఉండడంతో ఇక్కడి స్టేషన్ చోడవరానికి తరలించే ప్రతిపాదన కూడా సిద్ధమవుతున్నట్టు సమాచారం. కొత్తగా గొలుగొండలో ఎస్ఈబీ స్టేషన్ ఏర్పాటు చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. గంజాయి, నాటుసారా, ఇసుక, మద్యం రవాణాను అరికట్టడానికి కొద్దిరోజుల క్రితమే స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో(ఎస్.ఈ.బి) ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ప్రతి జిల్లాకు ఒక ఏఎస్పీ స్థాయి అధికారిని ఇన్ఛార్జిగా నియమించారు. దిగువ స్థాయిలో ఎక్కువ మంది సిబ్బందిని ఎస్ఈబీకి బదలాయింపు చేసింది. దీంతో గ్రామీణ ప్రాంతంలోని ఎక్సైజ్ స్టేషన్లు ఇకపై ఎస్ఈబీ స్టేషన్లుగా మారనున్నాయి. ఈ విభాగం పరిధిలోకి తాజాగా గుట్కా, ఆన్లైన్ జూదాన్ని కూడా చేర్చారు. ఇకపై ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ కేవలం ప్రభుత్వ మద్యం అమ్మకాలకే పరిమితం కానుంది. ఇందుకు సంబంధించి జిల్లా అంతటికీ విశాఖలో మాత్రమే కార్యాలయం ఉంటుంది.
ప్రస్తుతం అనకాపల్లిలో ఉన్న అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయం ఇకపై అసిస్టెంట్ ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ కార్యాలయంగా మారుతోంది. దీని పరిధిలో విశాఖ గ్రామీణం మొత్తం ఉంటుంది. పరిపాలనాపరంగా ఇబ్బందులు ఉండటంతో రెండుగా విభజించాలనే ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. కొత్తగా నర్సీపట్నంలో ఏఈఎస్ కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తారని అధికార సమాచారం. ప్రస్తుతం అనకాపల్లిలో నడుస్తున్న ఏఎస్ కార్యాలయాన్ని చోడవరానికి తరలిస్తారని తెలుస్తోంది. అనకాపల్లి పట్టణం విశాఖ జీవీఎంసీ పరిధిలో ఉండటమే ఇందుకు కారణమని అధికార వర్గాలు భావిస్తున్నాయి.