బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో... రేపు ఉదయం నుంచి విశాఖ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. ఈ సూచన దృష్ట్యా అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని విశాఖ జిల్లా కలెక్టర్ వి.వినయ్ చంద్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం 5.30 గంటల నుంచి తీవ్రత పెరగవచ్చన్న వాతావరణ శాఖ సూచనలను మేరకు ఆర్డీవో, ఇరిగేషన్, వ్యవసాయం, మత్య్స శాఖ, రహదారులు భవనముల శాఖ అధికారులతో కలెక్టర్ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.
అంతా అప్రమత్తం
జిల్లాలోని రైవాడ, తాండవ, కోణాం, పెద్దేరు జలాశయాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తుండాలని, జలాశయాలకు దిగువనున్న గ్రామస్థులను అప్రమత్తం చేసి నీటిని విడుదల చేయాలని కలెక్టర్ అన్నారు. మండలాల్లోని మైనర్ ఇరిగేషన్ ట్యాంకులను పరిశీలించాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. తహసీల్దార్లు మండల కేంద్రాల్లోనే ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని ఆర్డీవోలను ఆదేశించారు. తీర ప్రాంత మండలాల్లోని తహసీల్దార్లు, అధికారులు, సిబ్బంది అప్రమత్తతో ఉండి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని ఆదేశించారు.