విశాఖ ఫిషింగ్ హార్బర్.. ఎప్పుడూ బోట్లు, మత్స్య సంపదతో కళకళలాడుతూ ఉంటుంది. ఏటా ఏప్రిల్ 15 నుంచి జూన్ 15 వరకు వేటకు విరామంగా ప్రభుత్వాలు ప్రకటిస్తాయి. ఈ సమయంలో సముద్రంలో వేట నిలిపివేస్తారు. చేపల ప్రత్యుత్పత్తి సమయమైన ఈ రెండు నెలలు విరామంగా అమలుచేస్తారు. ఈసారి మాత్రం లాక్డౌన్ కారణంగా ఏప్రిల్ 1 నుంచి సముద్రంలోకి వెళ్లడంపై నిషేధించారు. సడలింపుల్లో భాగంగా ఈ నెల 1 నుంచి తిరిగి సముద్రంలోకి వెళ్లి వేట కొనసాగించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. చేపలు బాగా పడుతాయన్న ఆశతో బోటు కట్టి సముద్రంలోకి వెళ్లిన మత్స్యకారులకు నిరాశే ఎదురవుతోంది.
ప్రత్యుత్పత్తి కాలం ఇంకా పూర్తి కాకపోవడం వల్ల వేటలో చిన్న చేపలు మాత్రమే పడుతున్నాయని జాలర్లు అంటున్నారు. ఇప్పటి వరకు ఫిషింగ్ హార్బర్ నుంచి 330 బోట్లు సముద్రంలోకి వెళ్లాయి. వెళ్లిన బోట్లన్నీ నిరుత్సాహంగానే తిరిగి వచ్చాయి. రెండు వారాలు ముందుగా బోటింగ్ ప్రారంభం కావడం వల్ల రానున్న రోజుల్లో చేపల ఉత్పత్తిపై ప్రభావం పడే అవకాశం ఉంటుందని మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వేట విరామం ముగింపుపై తమ అభిప్రాయాలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. సముద్రంలోకి వెళ్లిన బోట్లకు కనీసం నిర్వహణ ఖర్చులు కూడా వచ్చే పరిస్థితి కనిపించడం లేదని ఆవేదన చెందుతున్నారు.