గంజాయిని ఇష్టారాజ్యంగా వినియోగిస్తూ మత్తుకు బానిసలుగా మారుతున్న వారిపై ఉక్కుపాదం మోపాలని విశాఖ సీపీ మనీశ్‌కుమార్‌సిన్హా నిర్ణయించారు. ఆమేరకు విశాఖ నగర కమిషనరేట్ పరిధిలోని అన్ని పోలీసుస్టేషన్ల సీఐలు, ఏసీపీలకు, ఏడీసీపీలకు, స్పెషల్ ఎన్ఫోర్స్‌మెంట్ బ్యూరో(సెబ్) అధికారులకు ఇటీవలే ఆదేశాలు జారీ చేశారు. గంజాయి అక్రమ రవాణా, వినియోగానికి అడ్డుకట్ట వేయడానికి వీలుగా పోలీసులు వ్యూహం మార్చారు. కేవలం గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్నవారితోపాటు గంజాయిని కొద్దిమొత్తాల్లో వినియోగిస్తున్నవారిని కూడా గుర్తించాలని నిర్ణయించారు. గంజాయిని కొద్దిమొత్తంలో కలిగిఉండడం కూడా నేరమేనన్న విషయం తెలిసిందే. గంజాయికి అలవాటుపడ్డవారు ఎంతో కొంత పరిమాణంలో భద్రపరుచుకుంటుంటారు. గంజాయిని పీల్చేటప్పుడైనా కొంతమొత్తం వారి దగ్గర దొరుకుతుంది. గతంలో ఎక్కువ పరిమాణంలో రవాణా చేసేవారిపైనే ప్రధానంగా దృష్టిసారించిన పోలీసులు తాజాగా వినియోగదారులపైనా నిఘా పెట్టారు.
నగరంలోని ప్రాంతాల్లో నిఘా:
గంజాయి తాగుతూ పట్టుబడితే తలెత్తే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని పలువురు నిర్జన ప్రదేశాలకు వెళ్లి గంజాయిని పీలుస్తుంటారు. నగరంలోని బస్టాండు, రైల్వేస్టేషన్లు, ఫ్లైవోవర్ బ్రిడ్జి కిందభాగంలోనూ, బీచ్‌రోడ్డులోని కొన్ని దుకాణాల వద్దా, పార్కుల్లో పొదల మాటున ఉండి కూడా కొందరు గంజాయిని తాగుతుంటారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని పలువురిపై దాడులు చేయడం మొదలుపెట్టారు. దీంతోపాటు కొనుగోలుదారులకు గంజాయిని సరఫరా చేసే ముఠాల సంఖ్యకు కూడా నగరంలో ఏమాత్రం కొదవలేదు. ఆయా విక్రయాదారులపైనా పోలీసులు నిఘా పెట్టారు.
ఆంధ్రవిశ్వవిద్యాలయంలో పట్టుబడ్డ ఆరుగురు నిందితులు:
ఆంధ్రవిశ్వవిద్యాలయంలోని ఇంజినీరింగ్ కళాశాల న్యూక్లాస్‌రూం బిల్డింగ్ సమీపంలో కొందరు గంజాయి తాగుతున్నట్లు మూడోపట్టణ పోలీసులకు సమాచారం రావడంతో మంగళవారం రాత్రి తనిఖీలు నిర్వహించారు. ఆరుగురు నిందితులు ఒకచోట కూర్చొని క్యాంప్‌ఫైర్ తరహాలో మంట వెలిగించుకుని దాని చుట్టూ కూర్చొని గంజాయి తాగుతున్నట్లు గుర్తించి వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి గురించి ఆరా తీయగా దువ్వాడకు చెందిన రౌడీషీటర్ దాకమర్రి దుర్గారావు అలియాస్ ఏటీఎం అనే వ్యక్తి వారి బృందంలో ఉన్నట్లు నిర్ధరణ అయ్యింది. ముత్యాల కార్తీక్, తలాడ తిరుమలరావు, బానోతు శివ, మజ్జివిజయకుమార్, రొయ్యి మోసయ్యబాబు తదితరులున్నట్లు తేలింది. వారిపై కేసు నమోదు చేసి న్యాయస్థానంలో హాజరుపరచగా వారికి 14రోజుల రిమాండు విధించారు. దీంతో వారందరినీ జైలుకు పంపారు. ఆంధ్రవిశ్వవిద్యాలయంలో ఇటీవల భద్రత కట్టుదిట్టం చేసినప్పటికీ సంబంధం లేని వ్యక్తులు విశ్వవిద్యాలయ ప్రాంగణంలో గంజాయి పీలుస్తూ పట్టుబడడం గమనార్హం.