ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'విశాఖలో భూ ఆక్రమణలకు పాల్పడ్డవారు స్వచ్ఛందంగా తిరిగిచ్చేయాలి' - విశాఖ భూ ఆక్రమణలు తాజా వార్తలు

విశాఖలో ప్రభుత్వ భూములు ఆక్రమించుకున్న వారు స్వచ్ఛందంగా ఆ భూమిని ప్రభుత్వానికి అప్పగించాలని రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి స్పష్టం చేశారు. లేకుంటే ఆక్రమార్కులపై క్రిమినల్ కేసులు పెడతామని హెచ్చరించారు. విశాఖలో ఎన్ని కోట్ల భూమి ఆక్రమణకు గురైందో త్వరలోనే కలెక్టర్ వివరాలు బహిర్గతం చేస్తారన్నారు.

'విశాఖలో భూ ఆక్రమణలకు పాల్పడ్డవారు స్వచ్ఛందంగా తిరిగిచ్చేయాలి'
'విశాఖలో భూ ఆక్రమణలకు పాల్పడ్డవారు స్వచ్ఛందంగా తిరిగిచ్చేయాలి'

By

Published : Dec 21, 2020, 10:36 PM IST

విశాఖలో ప్రభుత్వ భూములు ఆక్రమించుకున్న వారు స్వచ్ఛందంగా ఆ భూమిని ప్రభుత్వానికి అప్పగించాలని..లేనిపక్షంలో వారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని ఎంపీ విజయసాయిరెడ్డి హెచ్చరించారు. విశాఖను పరిపాలన రాజధానిగా ప్రకటించిన నేపథ్యంలో కేవలం ప్రభుత్వ భూములు మాత్రమే వినియోగించి నూతన కార్యాలయాలు నిర్మించే ఆలోచనతో ముందుకు వెళ్తున్నట్లు వెల్లడించారు. రైతులు నుంచి వేల ఎకరాలు తీసుకుని ప్రజావ్యతిరేకంగా గత ప్రభుత్వం పనిచేసిందని విమర్శించారు. ప్రభుత్వ భూముల ఆక్రమణలకు పాల్పడిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. విశాఖ భూ అక్రమాల విషయంలో రెవెన్యూ అధికారులు కూడా భాగస్వాములుగా ఉన్నారని ఆరోపించారు.

కొందరు రాజకీయ నేతలు దేవాదాయ శాఖ భూములు కూడా మింగేశారని విమర్శలు గుప్పించారు. కొండ పోరంబోకు, నది పరివాహక ప్రాంతంలో సైతం కొందరు తెదేపా నేతలు ఆక్రమణలు చేశారన్నారు. ప్రభుత్వ భూములు అక్రమించుకున్న తెదేపా నేతలు స్వచ్ఛందంగా వెనక్కి ఇచ్చేయాలన్నారు. భూఅక్రమాలు చేసిన వారిపై సెక్షన్ 466, 467, 120బి, 420 కేసులు పెట్టడానికి అవకాశాలు ఉన్నట్లు విజయసాయి వెల్లడించారు. విశాఖలో ఎన్ని కోట్ల భూమి ఆక్రమణకు గురైందో త్వరలోనే కలెక్టర్ వివరాలు బహిర్గతం చేస్తారన్నారు. ఎన్నో ఏళ్ళుగా అపరిష్కృతంగా ఉన్న సింహాచల భూముల సమస్య పరిష్కారానికి సీఎం జగన్ దృష్టి పెట్టారన్నారు. ఆ వ్యవహారంపై కమిటీ వేసి సమస్య పరిష్కార దిశగా అడుగులు వేశారన్నారు. సీఎం జగన్ వల్లే సింహాచల భూముల సమస్య పరిష్కారమవుతుందని వ్యాఖ్యానించారు.

ABOUT THE AUTHOR

...view details