అంతర్జాలయం వేదికగా జరిగిన ద ఇండ్ యూఎస్ ఎంటర్‌ప్రెన్యూర్స్(టి.ఐ.ఈ) గ్లోబల్ సమ్మిట్ -2020ని ఉద్దేశించి ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు ప్రసంగించారు. లాభాపేక్ష లేని టీఐఈ సంస్థ సిలికాన్ వ్యాలీ ఆధారితంగా పనిచేస్తోంది. ఇది నెట్‌వర్కింగ్ ద్వారా అంకుర సంస్థలకు (స్టార్టప్స్) సహకారం అందిస్తోంది. భారతదేశంలోకి పెట్టుబడులకు ప్రోత్సాహాన్ని అందించేందుకు అంతర్జాతీయ సమ్మేళనం-2020 నిర్వహిస్తోంది. విశాఖలో పర్యటిస్తున్న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఈ సదస్సులో మాట్లాడుతూ, ప్రతిభావంతులైన యువత శక్తి సామర్థ్యాన్ని సంపూర్ణంగా వినియోగించుకోవాలని సూచించారు. ఉద్యోగార్థులు కాకుండా.. ఉద్యోగాల సృష్టికర్తలుగా యువత ఆలోచనల్లో మార్పు రావాలని ఆయన ఆకాంక్షించారు.
యావత్ ప్రపంచానికి ఆర్థిక అవకాశాలు
ఔత్సాహిక పారిశ్రామిక సామర్థ్యాన్ని ప్రోత్సహించడమంటే, సరైన ఆర్థిక విధానాన్ని అనుసరించి, ఉత్తమ విద్యా పాఠ్యప్రణాళికను అభివృద్ధి చేయడం మాత్రమే కాదని, ఆవిష్కరణలు, ఆలోచనలు ఏకకాలంలో వృద్ధి చెందాలని వెంకయ్య అన్నారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తల విజయాలు సృష్టించే ఆర్థిక అవకాశాలు భారతదేశం కోసం మాత్రమే కాకుండా యావత్ ప్రపంచానికి ఉపయోగపడతాయన్నారు.
టీఐఈ కృషి అభినందనీయం