ముక్కుపచ్చలారని శిశువును పూడ్చివేయాలని విశాఖలోని జ్ఞానాపురం శ్మశానవాటికకు తీసుకువచ్చిన ఘటన కలకలం రేపింది. విశాఖ కాన్వెంట్ జంక్షన్లోని హిందూ శ్మశాన వాటికకు శనివారం సాయంత్రం ఏపీ31 డీఎఫ్ 0741 నంబర్ గల ఓ కారులో నలుగురు వ్యక్తులు వచ్చారు. పాప చనిపోయిందని.. పూడ్చివేయాలని శ్మశానవాటిక సిబ్బందితో చెప్పారు. ఏ ఆసుపత్రి నుంచి తీసుకొచ్చారని శ్మశాన వాటిక ఇంఛార్జ్ ప్రశ్నించడంతో రైల్వే న్యూకాలనీలోని కృష్ణా మెటర్నిటీ నర్సింగ్ హోమ్ నుంచి తెచ్చామంటూ.. ఓ లేఖను ఆయన చేతిలో పెట్టారు. కవర్లో ఉన్న శిశువును శ్మశాన వాటిక సిబ్బందికి అందించారు. సిబ్బంది శిశువును పూడ్చడం కోసం కవర్ని తెరవగా.. ఒక్కసారిగా శిశువు ఏడవడం ప్రారంభించింది. దీంతో ఆశ్చర్యనికిలోనైన సిబ్బంది.. తేరుకుని ఆ నలుగురినీ నిలదీశారు. దీంతో వారు అక్కడ నుంచి జారుకున్నారు. ఆ వ్యక్తుల తీరుపై అనుమానం వ్యక్తం చేసిన శ్మశాన వాటిక సిబ్బంది వారు చెప్పిన ఆసుపత్రికి శిశువును తీసుకెళ్లారు.
ఆసుపత్రికి వెళ్లి నిలదీత..
వెంటనే శ్మశానవాటిక సిబ్బంది శిశువును సంబంధిత ఆస్పత్రికి తీసుకెళ్లగా.. ఆ ఆసుపత్రి సిబ్బంది సైతం దురుసుగా ప్రవర్తించారు. బిడ్డను ఆసుపత్రిలో వదిలి బయటికి వెళ్లమంటూ కసురుకోవడంతో బిడ్డను ఆసుపత్రిలో వదిలి.. శ్మశాన వాటిక సిబ్బంది బయటికి వచ్చారు. ఆసుపత్రి యాజమాన్యం దురుసుతనం, శిశువును తీసుకువచ్చిన వారు పరారవడం కొత్త ప్రశ్నలకు తెరలేపింది. రోజల చిన్నారిని కవర్లో పెట్టి తీసుకురావడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పోలీసులకు ఫిర్యాదు..
అసలు శిశువును ఆ ఆసుపత్రి నుంచే తీసుకొచ్చారా..? లేక నకిలీ రశీదు సృష్టించారా..? ఇంతకీ బిడ్డకు జన్మనిచ్చిన తల్లి ఎవరు.. ఎందుకు చంపాలనుకున్నారు..? శిశువు శరీరంపై చిన్న చిన్న గాయలు ఉండటం.. ఏదైన గుడ్డలో కాకుండా కవర్లో పెట్టి తీసుకువచ్చిన తీరుపై సిబ్బంది అనుమానం వ్యక్తం చేశారు. ఇంతకూ ఆ శిశువును తీసుకొచ్చిన నలుగురు ఎవరు..? తదితర విషయాలు సమాధానం లేని ప్రశ్నలుగానే మిగిలిపోయాయి. దీంతో ఈ ఘటనపై శనివారం శ్మశానవాటిక ఇంఛార్జ్ ప్రసన్నకుమార్ కంచరపాలెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఆసుపత్రి సిబ్బందిని ప్రశ్నించగా.. ఆ చిన్నారి ఐసీయూలో ఉన్నట్లుగా పోలీసులకు సమాచారం అందినట్లు తెలిసింది. ఎవరూ తీసుకెళ్లారనే వివరాలు తెలియాల్సి ఉందని సమాచారం.